Share News

414 కేంద్రాలు.. 5 లక్షల మెట్రిక్‌ టన్నులు

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:53 AM

Arrangements for grain procurement ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది ఖరీప్‌లో జిల్లా నుంచి ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం విధించింది. జిల్లాలో 414 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టనుంది.

414 కేంద్రాలు.. 5 లక్షల మెట్రిక్‌ టన్నులు
కరగాం వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు

ధాన్యం కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు

గ్రేడ్‌-1 రకం క్వింటాకు మద్దతు ధర రూ.2,461

సాధారణ రకం రూ.2,441

నరసన్నపేట, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):

ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది ఖరీప్‌లో జిల్లా నుంచి ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం విధించింది. జిల్లాలో 414 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టనుంది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవల ప్రకటించారు.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. రెండేళ్లు సన్నరకం ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 85 శాతం మంది రైతులు సాధారణ రకమే సాగు చేశారు. అర్నబ్‌, మురసు తుఫాన్ల ప్రభావంతో పంటకు కొంతమేర నష్టం వాటిల్లింది. దిగుబడి తగ్గింది. ప్రస్తుతం పలుచోట్ల రైతులు వరికోతలు చేపడుతున్నారు. పచ్చిధాన్యాన్ని రోడ్లమీద ఆరబెడుతున్నారు. ధాన్యం విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి జలుమూరు, సారవకోట, పాతపట్నం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన మండలాల్లో మరో రెండు రోజుల్లో కేంద్రాలు ప్రారంభించేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లు ఆదేశాలు జారీచేశారు. కొనుగోలు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో ఏజెన్సీలకు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు, వీఏవో, వీఆర్వోలు, డేటా ఆపరేటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. పీఏసీఎస్‌, ఎఫ్‌పీవో, డీసీఎంఎస్‌, డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు.

మద్దతు ధర పెంపు

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వరికి మద్దతు ధర పెంచింది. గతేడాది క్వింటా సాధారణ రకం రూ.2,369 కాగా, ఈ ఏడాది రూ.2,441కి కొనుగోలు చేయనున్నారు. గ్రేడ్‌-1 రకం క్వింటాకు రూ.2,461 మద్దతు ధర ప్రకటించారు. 80 కేజీలు బస్తా అయితే.. రూ.1,952, గ్రేడ్‌ -1కు రూ.1,968 చొప్పున చెల్లిస్తారు. రైతులు నచ్చిన కేంద్రంలో ధాన్యం విక్రయించుకోవచ్చు. రైతు పండే పంటను రైతు సేవాకేంద్రాలకు సమాచారం ఇస్తే.. షెడ్యూల్‌ ఇస్తారు. షెడ్యూల్‌ ఇచ్చిన తరువాత ధాన్యం శాంపిల్స్‌ను సాంకేతిక నిపుణులు సేకరించి శాసీ్త్రయ పద్ధతిలో తేమ, పొల్లు మొదలగు నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తారు. నాణ్యత తక్కువగా ఉంటే రైతులకు ధాన్యం బాగు చేసేందుకు అవకాశం ఇస్తారు. తరువాత జియో ట్యాగింగ్‌ కలిగిన వాహనాలతో మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసి మిల్లరుకు ధాన్యం అప్పగిస్తారు. హమాలీ చార్జీలు క్వింటాకు రూ.17లు, రవాణా చార్జీలు, క్వింటాకు రూ.28 నుంచి రూ.30 వరకు చెల్లించనున్నారు.

దోపిడీ అరికట్టేనా?

కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్లు ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలిస్తారు. బియ్యం దిగుబడి పరీక్షలు నిర్వహిస్తారు. గతేడాది తేమశాతం, దిగుబడి పరీక్షల సమయంలో బ్రోకన్‌ రైస్‌(నూకలు) ఎక్కువ ఉన్నాయని చెబుతూ.. రైతుల వద్ద మిల్లర్లు అదనంగా బస్తాకు (80కేజీల) మూడు నుంచి ఐదు కేజీల వరకూ ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాలశాఖ డీఎం శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేపడతామన్నారు. నిబంధనలు అతిక్రమించిన మిల్లర్లపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Nov 27 , 2026 | 12:53 AM