385.24 ఎకరాలు.. 99 ఏళ్ల లీజు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:30 AM
Green signal for salt lands required for Moolapet port మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో మరో అడుగు ముందుకు పడింది. చాలాకాలంగా పోర్టుకు అవసరమైన ఉప్పు భూములు లభించక తలలు పట్టుకుంటున్న అధికారులకు ఊరట లభించింది.
మూలపేట పోర్టుకు అవసరమైన ఉప్పు భూములకు గ్రీన్‌సిగ్నల్
చొరవ చూపిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
టెక్కలి/సంతబొమ్మాళి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో మరో అడుగు ముందుకు పడింది. చాలాకాలంగా పోర్టుకు అవసరమైన ఉప్పు భూములు లభించక తలలు పట్టుకుంటున్న అధికారులకు ఊరట లభించింది. ఈ సమస్యను మంగళవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్‌గోయల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి ఉప్పు భూముల సేకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సంబంధిత సాల్ట్ కమిషనర్ సైతం సర్వేనెం.408లో 385.24 ఎకరాల ఉప్పు భూములు ఏపీ మారిటైం బోర్డుకు 99ఏళ్ల లీజుకు బదలాయిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం రూ.9,24,57,600 ఇచ్చేందుకు అంగీకరించారు.
మూలపేట పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 21శాతం పనులు జరిగాయి. ప్రస్తుత కూటమి పాలనలో రూ.1,900 కోట్లతో మరో 51 శాతం పనులు పూర్తిచేశారు. రూ.4,361.91కోట్లతో నిర్మిస్తున్న ఈ పోర్టుకు సంబంధించి 826.51 ఎకరాలు అవసరమని గుర్తించారు. ప్రైవేట్ పట్టా భూములు 312.40 ఎకరాలు, ఉప్పు భూములు 293.97 ఎకరాలు, గ్రామకంఠం భూమి 9.65 ఎకరాలు, ప్రభుత్వ భూముల సరిహద్దు 81.11 ఎకరాలు, సీఆర్‌జెడ్ కోస్టల్ యాక్ట్ 121.92 ఎకరాలు, అటవీశాఖ 1.79 ఎకరాలు, రెవెన్యూ 0.67 ఎకరాలు మొత్తం ఫేజ్-1లో పోర్టు నిర్మాణానికి అవసరమని శ్రీ విశ్వసముద్ర సంస్థ గుర్తించింది. వేసవి నాటికి షిప్ ట్రైల్‌రన్ వేసేలా పనులు వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఉప్పు భూముల సమస్యకు కూడా అడ్డంగి తొలగడంతో పనులు మరింత జోరుగా సాగుతాయని ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పు భూములతో మహర్దశ: మంత్రి అచ్చెన్నాయుడు
మూలపేటలో పోర్టుకు ఉప్పు భూములు అప్పగిస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయంతో పోర్టుకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లీజు ప్రాతిపదికన భూములు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం శుభపరిణామమని తెలిపారు. పౌరవిమాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చొరవతో ఈ కీలక సమస్య పరిష్కారమైందన్నారు. మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా మారుతుందని, తద్వారా వేలమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.