Share News

35 జడ్పీటీసీ , 143 ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణ

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:20 AM

Rejection of nominations స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను శనివారం అధికారులు పరిశీలించారు. జిల్లాలో 30జడ్పీటీసీ స్థానాలకు 245 నామినేషన్లు, 542 ఎంపీటీసీ స్థానాలకు 2,949 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కొంతమంది అభ్యర్థులు రెండు నుంచి నాలుగు సెట్లు చొప్పున నామినేషన్లు సమర్పించారు.

35 జడ్పీటీసీ , 143 ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణ
జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులు

పూర్తయిన పరిశీలన

నేడు అప్పీలుకు అవకాశం

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను శనివారం అధికారులు పరిశీలించారు. జిల్లాలో 30జడ్పీటీసీ స్థానాలకు 245 నామినేషన్లు, 542 ఎంపీటీసీ స్థానాలకు 2,949 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కొంతమంది అభ్యర్థులు రెండు నుంచి నాలుగు సెట్లు చొప్పున నామినేషన్లు సమర్పించారు. వీటిని అధికారులు పరిశీలించి.. ఒక అభ్యర్థికి ఒక నామినేషన్‌గానే పరిగణించారు. నిబంధనల మేరకు వివరాలు సరిపోయినవి మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. జడ్పీటీసీలకు సంబంధించి 35 నామినేషన్లను తిరస్కరించారు. ఇందులో ఇచ్ఛాపురం నుంచి జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన రేషన్‌ డీలర్‌ హిమ శైలజ కూడా ఉన్నారు. అలాగే ఎంపీటీసీ నామినేషన్లు 143 తిరస్కరించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లను ఆదివారం అప్పీలు చేసేందుకు అవకాశం ఉందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ‘ఆదివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు అప్పీలు స్వీకరిస్తాం. ఎంపీటీసీ అభ్యర్థులు.. డివిజన్‌ పరిధిలో ఆర్డీవో వద్ద, జడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టర్‌ ఎదుట అప్పీలను సమర్పించాలి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్‌ కేంద్రాల్లో ప్రత్యేక సహాయక బృందాలను సైతం నియమించాం. తిరస్కరణ ఉత్తర్వులు, పరిశీలన నివేదికలు తదితర పూర్తి దస్త్రాలను ఆర్డీవోలు, కలెక్టరేట్‌ కార్యాలయానికి వెంటనే పంపాలి. ఆ అప్పీలపై సోమవారం విచారణ చేపట్టి.. తుది నిర్ణయం వెల్లడిస్తామ’ని కలెక్టర్‌ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. ఆరోజు సాయంత్రం నుంచి ఎన్నికల బరిలో ఏయే పార్టీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారన్నదీ స్పష్టమవుతుంది.

ఆమోదించిన నామినేషన్లు...

-----------------------------------

పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ

-----------------------------------

టీడీపీ 74 1,186

వైసీపీ 62 1,182

జనసేన 26 215

బీజేపీ 22 100

కాంగ్రెస్‌ 14 12

సీపీఐ(ఎం) 4 10

ఇండిపెండెంట్లు 7 97

సీపీఐ 1 0

ఇతరులు 0 2

బీఎస్పీ 0 2

-----------------------------------

మొత్తం 210 2806

-----------------------------------

Updated Date - Oct 25 , 2026 | 12:20 AM