330 సీట్లు.. 164 ప్రవేశాలు
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:54 PM
Lack of interest in engineering colleges అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గాయి. వివిధ కారణాలతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ ఏడాది 50 శాతం మాత్రమే ప్రవేశాలు భర్తీ అయ్యాయి. విశ్వవిద్యాలయంలో ఐదు బ్రాంచ్‌లు ఉన్నాయి.
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలపై అనాసక్తి
ఎచ్చెర్ల రూరల్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గాయి. వివిధ కారణాలతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ ఏడాది 50 శాతం మాత్రమే ప్రవేశాలు భర్తీ అయ్యాయి. విశ్వవిద్యాలయంలో ఐదు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఒక్కో బ్రాంచ్‌లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్) కోటాతో కలిపి 66 సీట్లు ఉన్నాయి. మొత్తం 330 సీట్లకుగానూ 164 ప్రవేశాలు పూర్తయ్యాయి. ఏపీఈఏపీసెట్ ద్వారా ప్రవేశాలు నిర్వహించగా.. ఈసీఈలో 59, సీఎస్‌ఈలో 44, ట్రిపుల్‌ఈలో 26, మెకానికల్‌లో 18, సివిల్‌లో 17 సీట్లు భర్తీ అయ్యాయి. విశాఖపట్నంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించి తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఇక్కడ చదివించేందుకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవటం గమనార్హం.
అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 2018లో ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ బ్రాంచ్‌లతో కళాశాల ప్రారంభించారు. అనంతరం 2022లో సివిల్, ట్రిఫుల్‌ఈ బ్రాంచ్‌లు ప్రారంభించారు. ప్రారంభంలో ప్రవేశాలు కొంత వరకు మెరుగ్గా ఉన్నా, గత మూడేళ్ల నుంచి తగ్గుతున్నాయి. ప్రస్తుతం 30 శాతం లోపు ప్లేస్‌మెంట్‌లు లభిస్తున్నాయి. రూ.3.50 లక్షలు నుంచి రూ. 6లక్షలు దాటి ప్యాకేజ్‌లు రావడం లేదు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. అర్హులైన కాంట్రాక్టు ఫ్యాకల్టీ నియమించలేదు. సబ్జెక్టు కాంట్రాక్టు టీచర్స్‌తో నెట్టుకువస్తున్నారు. ల్యాబ్‌లు, వర్కుషాపులు వంటివి లేవు. దీంతో చాలామంది విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపటం లేదు. యూనివర్సిటీ అధికారులు స్పందించి.. ఈ సమస్యలు పరిష్కరించి.. ప్రవేశాల మెరుగుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
మెరుగైన విద్యా ప్రమాణాలపై దృష్టి
ఏపీఈఏపీ సెట్ ద్వారా ప్రవేశాలు తక్కువగా ఉన్నా, ఈ సెట్ ద్వారా నిర్వహించే సివిల్, మెకానికల్, ట్రిఫుల్‌ఈల్లో లేట్రల్ ప్రవేశాలు మెరుగ్గా జరుతున్నాయి. ప్లేస్‌మెంట్ సెల్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెడతాం. రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
డాక్టర్ సీహెచ్ రాజశేఖర్‌రావు, ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ కాలేజ్