30 కేజీల గంజాయి సీజ్
ABN , Publish Date - May 28 , 2026 | 11:33 PM
ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు వేర్వేరుగా అక్రమంగా తరలిస్తున్న 30కేజీల680 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఇద్దర్ని అరెస్ట్ చేశామని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు.
ఇచ్ఛాపురం, మే 28 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు వేర్వేరుగా అక్రమంగా తరలిస్తున్న 30కేజీల680 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఇద్దర్ని అరెస్ట్ చేశామని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన రాహుల్ విష్ణు ఇంగ్లే జల్నలో స్టేషన్ రోడ్డులో ఉంటున్నాడు. అదే రాష్టానికి చెందిన గంజాయి వ్యాపారం చేసే సురేష్ కైలాస్ ఠాకూర్‌తో పరిచయం ఏర్పడింది. రాహుల్ పలుసార్లు తన అవసరాలకోసం సురేష్ వద్ద అప్పులు తీసుకొనేవాడు. తాను చెప్పిన వ్యక్తి నుంచి గంజాయిని తీసుకొని వస్తే ఖర్చులు పోను కేజీ గంజాయికి రూ.1000 ఇస్తానని సురేష్ చెప్పగా దానికి రాహుల్ ఒప్పుకున్నాడు. ఆ క్రమంలో ఒడిశాలో కొనుగోలు చేసిన 22కేజీల 250గ్రాముల గంజాయిని పట్టుకొని ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు గురువారం సాయంత్రం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ సమయంలో అనుమా నస్పదంగా కనిపించిన రాహుల్ వద్ద తనిఖీలు చేయగా ఆయన వద్ద ఉన్న గంజాయిని, సెల్ ఫోన్‌ను సీజ్ చేసి అరెస్ట్ చేశారు.
ఒడిశా టు గుజరాత్
ఒడిశాలోని గంజాం జిల్లా దిగపొండి గ్రామానికి చెందిన లింకు బెహరా, గౌర బెహరా ఇద్దరు అన్నదమ్ములు. కొంతకాలం కిందట తన తండ్రి చనిపోయిన తర్వాత గౌర బెహరా గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా వెళ్లిపోయి అక్కడే స్ధిరపడ్డాడు. అక్కడ ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తుండే వాడు. గౌర బెహరా స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా తన తమ్ముడు సాయంతో గంజాయిని తీసుకెళ్లేవాడు. ఈక్రమంలో ఒడిశాలోని ఖందమాల్ జిల్లా తజుంగీయ గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారం చేసే సుజిత్ కుమార్‌నాయక్ గంజాయిని గౌర బెహరాకు అమ్ముతుండేవాడు. ఆ గంజాయిని లింకు బెహరా సాయంతో ఇచ్ఛాపురం, బరంపురం రైల్వేస్టేషన్ల వరకు తీసుకెళ్లేవాడు. అక్కడ నుంచి గౌరబెహరా గుజరాత్ పట్టుకెల్లేవాడు. ఈక్రమంలో గురువారం ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని లింకుబెహరా, గౌరబెహరా ఇద్దరు అన్నదమ్ములు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ఎం.తోటూరు రైల్వే ఎల్‌సీగేటు వద్ద గౌరబెహరా బైక్ దిగిపోయి రైల్వేస్టేషన్‌కు గంజాయిని తీసుకురమ్మని లింకు బెహరాకు చెప్పారు. గంజాయి పట్టుకొని స్టేషన్‌కు వెళ్తుండగా ఎల్‌సీగేటు వద్ద రూరల్ ఎస్‌ఐ లక్ష్మణరావు తనిఖీలు చేపట్టగా లింకు బెహరా వద్ద ఉన్న8కేజీల 430 గ్రాముల గంజాయిని పట్టుకొని అరెస్ట్‌చేశామని సీఐ చిన్నమనాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు ముకుందరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.