జడ్పీటీసీలకు 24, ఎంపీటీసీలకు 271
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:23 AM
జిల్లాలో పరిషత్ ఎన్నికల సందడి నెలకొంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బుధవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 30 జడ్పీటీసీ స్థానాలకు ఇప్పటివరకు 24, 543 ఎంపీటీసీ స్థానాలకు 271 నామినేషన్లు వచ్చాయి.
వైసీపీ, టీడీపీ అభ్యర్థుల నుంచే అత్యధిక దాఖలు
జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ నామినేషన్లు..
మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 24న పరిశీలన
శ్రీకాకుళం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్ ఎన్నికల సందడి నెలకొంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బుధవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 30 జడ్పీటీసీ స్థానాలకు ఇప్పటివరకు 24, 543 ఎంపీటీసీ స్థానాలకు 271 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ నామినేషన్లను శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో స్వీకరించారు.
జడ్పీటీసీకి 24 నామినేషన్లు
జిల్లాలోని 30 జడ్పీటీసీ స్థానాలకు బుధవారం నాటికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ నుంచి 14, టీడీపీ నుంచి 4, బీజేపీ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 2 నామినేషన్లు వచ్చాయి. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
ఎంపీటీసీకి 271 నామినేషన్లు
543 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం 271 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ నుంచి 147, టీడీపీ నుంచి 108, నామినేషన్లు వచ్చాయి. ఇతర పార్టీల నుంచి రెండు, స్వతంత్ర అభ్యర్థులుగా పద్నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ నెల 24న పరిశీలన
నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 24న ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రారంభం కానుంది. పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం
ఇచ్ఛాపురం/పలాస, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస మునిసిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రశాంతంగా సాగింది. బుధవారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు.. ఇచ్ఛాపురంలో 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి విత్‌డ్రా చేసుకోవడంతో టీడీపీకి మార్గం సుగుగమైంది. ఇక్కడ 28 వార్డులు ఉన్నాయి. టీడీపీ కూటమి, వైసీపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ సిట్టింగ్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మిని మరోసారి బరిలోకి దించగా, టీడీపీ సీనియర్ నాయకురాలు అశి లీలారాణిని అభ్యర్థిగా ప్రకటించింది. చైర్మన్ రేసులో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో పాటు మరో ఇండిపెండెంట్ నామినేషన్లు ఉన్నాయి. పలాసలో 36 వార్డుల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉండగా.. 6 స్థానాల్లో స్వతంత్రులు కూడా ఉన్నారు. చైర్మన్ అభ్యర్థులుగా వజ్జ గంగాభవానీ (టీడీపీ), శ్రీపద్మ (వైసీపీ), బద్రి సీతమ్మ (కాంగ్రెస్)తో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేష్లు ఉన్నాయి.
వామ్మో.. కోట్లా!
స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులకు ధర!
ముందుగానే సొమ్ము సమకూర్చాలని ఆశావహులకు షరతులు?
జడ్పీటీసీ ఎంపీపీ పదవుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్లు?
మెళియాపుట్టి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు ఆర్థిక భారం పెరుగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు పోటీ చేయాలంటే ముందుగానే లక్షల రూపాయలు సమకూర్చుకోవాలని కొందరు నాయకులు షరతులు పెడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ఖర్చుల పేరుతో ఒక్కో పదవికి ఒక్కో మొత్తం నిర్ణయిస్తున్నారనే చర్చ సాగుతోంది. దీంతో ఆర్థిక స్థోమత ఉన్నవారికే రాజకీయ పదవులు దక్కే పరిస్థితి ఏర్పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జడ్పీటీసీకి రూ.50 లక్షలా?
జిల్లాలోని ఓ మండలంలో జడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న నాయకుడికి రూ. 50 లక్షల వరకు సమకూర్చుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఖర్చులకు సిద్ధమని ఆయన చెప్పడంతో అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో మండలంలో ఎంపీపీ స్థానం ఎస్టీలకు కేటాయించారు. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ పీఠం దక్కాలంటే మొత్తం మీద రూ.45 లక్షల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికి అదనంగా మరో రూ.30 లక్షల వరకు అవసరమవుతుందనే చర్చతో పలువురు పోటీకి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని స్థానాలకు బీఫారాలు ఇస్తే ఖర్చు చేసేందుకు సిద్ధమని ఓ నాయకుడు ముందుకొచ్చినట్లు సమాచారం.
పలుకుబడి కంటే డబ్బుకే ప్రాధాన్యమా?
గతంలో గ్రామాల్లో ప్రజలతో పరిచయాలు, పలుకుబడి, సేవా కార్యక్రమాల ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందేవారు. ప్రస్తుతం ఆర్థిక స్థోమతకే ప్రాధాన్యం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అధికంగా ఖర్చు చేసే అభ్యర్థులకే మద్దతు లభిస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని కొందరు నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
రూ.కోటి అయినా ఖర్చు చేస్తామంటూ..
జడ్పీటీసీ, ఎంపీపీ పదవులపై ఆశావహుల్లో ఆసక్తి పెరిగింది. మండల స్థాయిలో రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయనే అంచనాతో ఎంత ఖర్చయినా వెనుకాడకూడదనే ధోరణి కొందరిలో కనిపిస్తోంది. శ్రీకాకుళం, పలాస, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కొందరు ద్వితీయశ్రేణి నాయకులు భారీగా ఖర్చు చేసి పోటీలో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మండల పరిషత్‌లకు ఆదాయం అధికంగా ఉన్న చోట్ల రూ.కోటి వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమంటూ కొందరు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది.