2 కొత్త పోలీసు స్టేషన్లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:37 AM
జిల్లాలో కొత్తగా రెండు పోలీసు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. నెలఖరు లోగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు పోలీసుశాఖ సన్నా హాలు చేస్తోంది.
విజయనగరం క్రైం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా రెండు పోలీసు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. నెలఖరు లోగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు పోలీసుశాఖ సన్నా హాలు చేస్తోంది. విజయనగరంలో త్రీ టౌన్ పోలీసుస్టేషన్ ఏర్పాటుకు ఏళ్ల నుంచి ప్రతిపాదన ఉంది. నగరంలో పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రెండు పోలీసుస్టేషన్ల నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదన్న అభిప్రాయంతో త్రీ టౌన్ ఏర్పాటుకు పదేళ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా ఆ ప్రతిపాదనలకు మోక్షం లభించింది. ఈ పోలీసుస్టేషన్ మంజూరు కావడంతో స్థల సేకరణ సాగుతోంది. కేఎల్ పురం, కణపాక ప్రాంతాల్లో ఏర్పాటు కావొచ్చని భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణ చేస్తున్నారు. నెలఖరులోగా తాత్కాలిక భవనంలో త్రీ టౌన్ పోలీసుస్టేషన్ ప్రారంభించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకంగా పోలీసుస్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం భోగాపురం పోలీసుస్టేషన్ ఉన్నా.. విమానాశ్రయాన్ని దృష్టిలో వుంచుకుని అక్కడ ప్రొటోకాల్, ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త పోలీసుస్టేషన్ మంజురైంది. ఇప్పటికే విమానాశ్రయం పనులు తుదిదశకు చేరుకోవడం, ట్రయల్ రన్‌కూడా విజయవంతం కావడం, త్వరలోనే విమానాల రాకపోకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే స్టేషన్ ఏర్పాటు, పోలీసు అధికారులు, సిబ్బంది నియామకంపై పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.