Share News

చెరువు నీటిలోనే.. 16 గంటలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:25 AM

A person trapped in a pond మతిస్థిమితం లేని ఆ వ్యక్తి కాలకృత్యాల నిమిత్తం చెరువు వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. ఆపై గుర్రపుడెక్కలో చిక్కుకున్నాడు. సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ సుమారు 16 గంటలపాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

చెరువు నీటిలోనే.. 16 గంటలు
గుర్రపుడెక్కలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు

రాత్రంతా గుర్రపుడెక్కలో చిక్కుకున్న వ్యక్తి

రక్షించిన పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు

పలాస రూరల్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేని ఆ వ్యక్తి కాలకృత్యాల నిమిత్తం చెరువు వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. ఆపై గుర్రపుడెక్కలో చిక్కుకున్నాడు. సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ సుమారు 16 గంటలపాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలాస మండలం గరుడఖండి సమీపాన సవరగెడ్డ చెరువులోని గుర్రపుడెక్కలో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు రక్షించారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ చెరువువైపు వెళ్లగా.. గుర్రపుడెక్కలో కాళ్లు, శరీరం చిక్కుకుని.. పైకి ఓ వ్యక్తి జుత్తు కనిపించింది. దానిని మృతదేహంగా భావించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గౌరీశంకర్‌, అగ్నిమాపకశాఖాధికారి సోమేశ్వరరావు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్రపుడెక్కలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించి.. అతికష్టంపై బయటకు తీశారు. ఆపై సపర్యలు చేసి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

రాత్రంతా నీటిలోనే..

తొలుత ఆ వ్యక్తి వద్ద ఆధార్‌ కార్డు కానీ, ఇతర వివరాలేవీ లభ్యం కాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆయన జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన రోహిత్‌దాసాగా గుర్తించారు. సుమారు 50 ఏళ్లు దాటిన ఈ వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలుసుకున్నారు. కాగా.. గురువారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కాలకృత్యాల నిమిత్తం ఈ చెరువు వద్దకు వచ్చి.. ప్రమాదవశాత్తూ మునిగి పోయాడని భావిస్తున్నారు. గుర్రపుడెక్కలో చిక్కుకుపోవడం.. అటువైపుగా ఎవరూ వెళ్లకపోవడంతో రాత్రంతా నీటిలోనే నానిపోయాడు. స్థానికులు చూసి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో క్షేమంగా ఆయనను ఒడ్డుకు చేర్చారు. 16 గంటలపాటు నీటిలోనే ఉండిపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న ఆయనకు స్థానికులు సపర్యలు చేశారు.

Updated Date - Sep 19 , 2026 | 12:25 AM