తొలిరోజు 12 నామినేషన్లు
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:35 AM
srikakulam corporation elections శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి తొలిఘట్టం ఆరంభమైంది. శనివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. రెండు చోట్లా మొత్తం 12 పత్రాలు దాఖలయ్యాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్‌తోపాటు 60 డివిజన్లకు, ఆమదాలవలస మునిసిపల్ చైర్‌పర్సన్‌తోపాటు 28 వార్డులకు సంబంధించి ఈ నెల 26న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
శ్రీకాకుళం కార్పొరేషన్లో పది..
ఆమదాలవలసలో రెండు నమోదు
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశం
శ్రీకాకుళం అర్బన్/ ఆమదాలవలస/ కలెక్టరేట్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):
శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి తొలిఘట్టం ఆరంభమైంది. శనివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. రెండు చోట్లా మొత్తం 12 పత్రాలు దాఖలయ్యాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్‌తోపాటు 60 డివిజన్లకు, ఆమదాలవలస మునిసిపల్ చైర్‌పర్సన్‌తోపాటు 28 వార్డులకు సంబంధించి ఈ నెల 26న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థకు సంబంధించి పది నామినేషన్ పత్రాలు దాఖలైనట్టు కమిషనర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. మేయర్ అభ్యర్థిగా బీజేపీకి చెందిన చల్లా గ్రీష్మసంజన... బీజేపీ, టీడీపీ, జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఆమె ఒక్కరే నాలుగు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక కార్పొరేటర్ స్థానాలకు ఆరు నామినేషన్లు పడ్డాయి. 7వ డివిజన్ నుంచి టీడీపీ తరపున ఉంగటి సత్యవతి, 18వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థులుగా మెంటాడ సద్గురు రామకృష్ణమూర్తి, మెంటాడ నవ్య నామినేషన్లు వేశారు. 49వ డివిజన్ నుంచి టీడీపీ తరపున బుర్రి మధుసూదనరావు, దొండపాటి కౌసల్య, 26వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పి.ఎస్.రామకృష్ణారావు నామినేషన్ పత్రాలను అందజేసినట్టు కమిషనర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి తొలిరోజు శనివారం రెండు నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారి ఎన్.చిన్నారావు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా వైసీపీ నుంచి బొడ్డేపల్లి భార్గవి, ఏకాశమ్మ నామినేషన్లు వేశారని తెలిపారు.
నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలి
‘కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి. నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వర్తించాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళం నగరం బొందిలీపురంలో వంశధార పాత క్వార్టర్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ జె.శ్రవణ్‌కుమార్‌తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. రిటర్నింగ్ అధికారుల గదులు, అభ్యర్థుల సహాయ కేంద్రం, నామినేషన్ పత్రాల స్వీకరణ కౌంటర్ల వద్ద కల్పించిన మౌలిక సదుపాయాలను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. కేంద్రం వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావ ళిని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం పరిసరాల్లోకి అనవసర వ్యక్తులను అనుమతించరాదని, ప్రతీ దశను వీడియో చిత్రీకరణ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
‘జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏడు మండలాల్లో ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల కేంద్రం వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామ’ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. శ్రీకాకుళం కలెక్టరేట్, వంశధార కార్యాలయం, ఆమదాలవలసలోని మునిసిపల్ కార్యాలయాల వద్ద నిఘా పెట్టాం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని నామినేషన్ల కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు సిద్ధం చేశాం. పరిసర ప్రాంతాల్లో డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. పోలీస్చట్టం-30 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయి. నామినేషన్ కేంద్రాల్లోకి అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతినిధులకు మాత్రమే అనుమతిస్తాం. నామినేషన్ కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు, పూర్తిగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ’ని ఎస్పీ స్పష్టం చేశారు.