113 మంది బాధితులు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:03 AM
Treatments at Singupuram PHC సింగుపురంలోని కొండమ్మతల్లి జాతరలో విక్రయించిన బాదంపాలు తాగి.. అస్వస్థతకు గురైన బాధితులకు స్థానిక పీహెచ్‌సీలో చికిత్స కొనసాగుతోంది. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ శుక్రవారం నాడు సుమారు 80 మందికిపైగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. శనివారం నాటికి 113 కేసులు నమోదయ్యాయి.
సింగుపురం పీహెచ్‌సీలో చికిత్సలు
ఆలస్యంగా మేల్కొన్న ఫుడ్ సేఫ్టీ
శ్రీకాకుళం నగరంలో అధికారుల తనిఖీలు
బాదంపాలు, క్లస్టర్డ్ పౌడర్ నమూనాల సేకరణ
శ్రీకాకుళం రూరల్/క్రైం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): సింగుపురంలోని కొండమ్మతల్లి జాతరలో విక్రయించిన బాదంపాలు తాగి.. అస్వస్థతకు గురైన బాధితులకు స్థానిక పీహెచ్‌సీలో చికిత్స కొనసాగుతోంది. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ శుక్రవారం నాడు సుమారు 80 మందికిపైగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. శనివారం నాటికి 113 కేసులు నమోదయ్యాయి. చాలామంది బాధితులు కోలుకున్నారు. శనివారం 27 మంది ఆస్పత్రిలో చేరారని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మేరీ కేథరిన్ తెలిపారు. ఒకరిని శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించామన్నారు. ఆస్పత్రిలో పీహెచ్‌సీ డాక్టర్ లిల్లీ, వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో ప్రస్తుతం 10 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. కొంతమందికి వైద్యసేవలు అందించి ఇంటికి పంపించేశామన్నారు. ఆస్పత్రిలో బాధితులను డ్వామా పీడీ, శ్రీకాకుళం ప్రత్యేకాధికారి బి.లవరాజు, జిల్లా పంచాయతీ అధికారి ఆర్.గోపీబాల, తహసీల్దార్ గణపతిరావు, ఎంపీడీవో వి.ప్రకాశరావు పరామర్శించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు శనివారం శ్రీకాకుళం నగరంలోని బాదంపాలు తయారీ కేంద్రాలు, మొబైల్ ఫుడ్‌షాపులు, ముడిసరుకు సరఫరా కేంద్రాలను తనిఖీ చేశారు. నాణ్యతలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆహారభద్రతాధికారి కె.లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానిత బాదంపాలు క్లస్టర్డ్ ఫౌడర్ నమూనాలను సేకరించారు. మూడు ఎన్‌ఫోర్స్‌మెంట్ శాంపిల్స్‌ను ల్యాబ్ ఏజెంట్లకు అందజేయగా మరో మూడు సర్వేలెన్స్ శాంపిల్స్‌ను విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆహార ప్రయోగశాలకు పంపించినట్టు ఆమె తెలిపారు. ఈ నివేదికలు ఆధారంగా బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ ఘటనకు కారణమైన ముగ్గురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ప్రజలు బయట పానీయాలు కొనేముందు తయారీ తేదీని గమనించాలని, రుచి లేదా వాసనలో తేడా ఉంటే వాటిని తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడి.. పీహెచ్‌సీలో బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
బాధితులందరూ సురక్షితం
కల్తీ బాదంపాలు తాగి ఆస్పత్రిలో చేరిన బాధితులంతా సురక్షితంగానే ఉన్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ జాతరలు, ఉత్సవాలు జరిగినా, వీధి వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలు, నీటిని ముందుగా పరీక్షించాలని ఆదేశించారు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా ఆర్డీవోలు, తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు బయటి ఆహార పదార్థాలు, పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.