10 మంది మత్స్యకారులు సురక్షితం
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:11 AM
సముద్రంలో వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యం, ప్రతికూల వాతావరణంతో చిక్కుకుపోయిన విశాఖ జిల్లాకు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
వీరంతా విశాఖ జిల్లాకు చెందిన వారు
ఒడిశా కోస్ట్ గార్డ్ సహకారంతో శ్రీకాకుళం పోలీసుల రెస్క్యూ
రక్షణ బృందానికి ఐజీ గోపీనాథ్ జెట్టి అభినందన
శ్రీకాకుళం/ఇచ్ఛాపురం, జూలై 7(ఆంధ్రజ్యోతి): సముద్రంలో వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యం, ప్రతికూల వాతావరణంతో చిక్కుకుపోయిన విశాఖ జిల్లాకు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఒడిశా మెరైన్ పోలీసు, కోస్ట్‌గార్డ్ అధికారులతో సమన్వయం తో మూడు రోజుల పాటు సాగించిన రక్షణ చర్యలు విజయవంతంగా ముగిశాయి. విశాఖ తీరానికి చెందిన 10 మంది మత్స్యకారులు జూన్ 24న బోటులో వేటకు వెళ్లారు. ఒడిశా సముద్ర సరిహద్దు ప్రాంతంలో వేట సాగిస్తుండగా బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అదే సమయంలో తుఫాన్ ప్రభావంతో వారంతా సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు.
రంగంలోకి ప్రత్యేక బృందం
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులపై విశాఖపట్నం రేంజ్, మెరైన్ విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి తక్షణమే స్పందించారు. వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డిని ఆదేశించారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు పర్యవేక్షణలో కవిటి ఎస్‌ఐ రవివర్మ, కానిస్టేబుళ్లు చిరంజీవి, బషీర్, హోంగార్డు శ్రీనివాస్‌లతో కూడిన ప్రత్యేక బృందం ఒడిశా సరిహద్దుకు వెళ్లింది.
సురక్షితంగా పారాదీప్ తీరానికి..
ఈ బృందం ఒడిశా మెరైన్ పోలీసు, కోస్ట్ గార్డ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సముద్రంలో ఉన్న మత్స్యకారులతో కమ్యూనికేషన్ కొనసాగించింది. మూడు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి బాధితుల బోటును ఒడిశాలోని పారాదీప్ సముద్ర తీరానికి సురక్షితంగా చేర్చారు. అనంతరం వారికి భద్రత, ఆహారం కల్పించి క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మత్స్యకా రుల ప్రాణాలు కాపాడిన ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయుడు బృందాన్ని ఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.