Share News

వర్షాలకు 2,405 కి.మీ. రోడ్లు ధ్వంసం

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:04 AM

తీవ్ర వాయుగుండం వల్ల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులన్నింటినీ త్వరలోనే పునరుద్ధరిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

వర్షాలకు 2,405 కి.మీ. రోడ్లు ధ్వంసం

  • త్వరలోనే పునరుద్ధరిస్తాం: మంత్రి జనార్దన్‌ రెడ్డి

  • రూ.1498 కోట్లతో ప్రాథమిక అంచనా

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం వల్ల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులన్నింటినీ త్వరలోనే పునరుద్ధరిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు, సహాయక చర్యలు చేపట్టామని ఆయన సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేశామన్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 2405 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనే 412 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 36చోట్ల రహదారులు కోతకు గురికాగా, 9చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని, ఈ ప్రాంతాల్లో రవాణాకు ఆటంకం కలగకుండా తక్షణమే తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తిచేశామన్నారు. 187 చోట్ల సీడీ వర్క్స్‌ దెబ్బతినగా, ఇప్పటికే 169చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టామని, 254 ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చేసామన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక పునరుద్ధరణ పనులకు దాదాపు రూ.162.09 కోట్లు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించడానికి రూ.1336.83 కోట్లు అవసరమవుతాయని తమశాఖ అంచనా వేసిందన్నారు. మొత్తంగా రూ.1498.30 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా రూపొందించినట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 05:04 AM