Share News

శ్రీసిటీకి పెట్టుబడుల వెల్లువ

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:11 AM

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని క్రియా యూనివర్సిటీలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా సోమవారం నిర్వహించిన చివరి ప్రాంతీయ సదస్సులో రూ.11 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి.

శ్రీసిటీకి పెట్టుబడుల వెల్లువ

  • 11 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేలకుపైగా ఉద్యోగాలు

  • పలు జిల్లాల్లో ప్రాజెక్టులకు 67 అవగాహన ఒప్పందాలు

  • ఎంఎస్‌ఎంఈ బ్యాంకింగ్‌ గ్రీవెన్స్‌

  • రిడ్రెసెల్‌ మెకానిజం పోర్టల్‌ ఆవిష్కరణ

  • శ్రీసిటీలో సీఐఐ ప్రాంతీయ సదస్సు

సత్యవేడు(శ్రీసిటీ), అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీసిటీలోని క్రియా యూనివర్సిటీలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా సోమవారం నిర్వహించిన చివరి ప్రాంతీయ సదస్సులో రూ.11 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాలకు సంబంధించి మొత్తం 67 అవగాహన ఒప్పందాల(ఎంవోయూలు)ను చేసుకున్నారు. వీటి ద్వారా రూ.11,731,68 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 20,879 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశం లభించనుంది. ఆయా జిల్లాల్లో ఏర్పాటు కానున్న 50 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,380,68 కోట్ల పెట్టుబడులతో మరో 16,612 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది.

వీటిలో 18 ప్రాజెక్టులు ఒక్క శ్రీసిటీలోనే ఏర్పాటు కానున్నాయి. ఈ సదస్సుతో రాష్ట్రంలో నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సులు విజయవంతంగా ముగిశాయని రాష్ట్ర యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆడిటోరియం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ(ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త) స్టాళ్లను ముఖ్య అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా రావత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాంతీయ పెట్టుబడులను ప్రోత్సహించడం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన 5 ప్రాంతీయ సదస్సులు ముగిశాయన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పారిశ్రామిక పెట్టుబడులను విస్తరించి, స్థానిక వనరులు, వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సులు నిర్వహించినట్టు తెలిపారు. శ్రీసిటీ, శ్రీకాళహస్తి ప్రాంతాలకు పారిశ్రామికంగా విశేష ప్రాధాన్యత ఉందని, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, స్థానిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, పెద్ద పరిశ్రమలతో అనుసంధానం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించవచ్చని పేర్కొన్నారు. శ్రీసిటీలో నిర్వహించిన సదస్సులో 21 ఎంఎ్‌సఎంఈ సంస్థలు పాల్గొన్నాయన్నారు.

నూతన పారిశ్రామికవిధానాలు

నూతన పారిశ్రామిక విధానాలు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రావత్‌ తెలిపారు. విశాఖపట్నంలో వచ్చే నెల 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలు, పారిశ్రామిక అవకాశాలు లభించనున్నాయని వివరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్‌ మాట్లాడుతూ.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త సూత్రం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించి, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు.

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామిక మౌలిక సదుపాయాలను విస్తరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. వైజాగ్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించనున్నట్టు చెప్పారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని యువరాజ్‌ తెలిపారు.

రాష్ట్రంలోని 175 పార్కుల్లో 153 పార్కుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. సీఐఐ ఏపీ వైస్‌ చైర్మన్‌ జి. సాంబశివరావు మాట్లాడుతూ.. పర్యాటకం, అతిథ్య రంగం, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, ఆటోమోటివ్‌, అంతరిక్షం, పాదరక్షల తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 05:11 AM