Share News

కరెంటు స్తంభంపైనే సీపీఆర్‌

ABN , Publish Date - Nov 28 , 2026 | 02:14 AM

విద్యుత్‌ లైన్‌ సరిచేస్తుండగా షాక్‌ కొట్టడంతో అతడు కరెంటు పోల్‌పైనే వాలిపోయాడు. ఆ వెంటనే గుండెపోటు కూడా రావడంతో ఆయన పరిస్థితి మరింత విషమించింది. అంతెత్తు స్తంభంపై అచేతనంగా పడిఉన్న వ్యక్తి ...

కరెంటు స్తంభంపైనే సీపీఆర్‌

  • మామకు అల్లుడి ప్రాణదానం.. లైన్‌ సరిచేస్తుండగా షాక్‌.. గుండెపోటు

  • ఎత్తయిన స్తంభంపై అచేతనంగా..చకచకా పోల్‌ ఎక్కి మామకు ‘ఊపిరి’

  • ‘గోల్డెన్‌ అవర్‌’లో సాయం అందటంతో నిలిచిన ప్రాణం

విద్యుత్‌ లైన్‌ సరిచేస్తుండగా షాక్‌ కొట్టడంతో అతడు కరెంటు పోల్‌పైనే వాలిపోయాడు. ఆ వెంటనే గుండెపోటు కూడా రావడంతో ఆయన పరిస్థితి మరింత విషమించింది. అంతెత్తు స్తంభంపై అచేతనంగా పడిఉన్న వ్యక్తి తిరిగి బతుకుతాడని ఎవరైనా అనుకోగలరా? సరిగ్గా అప్పుడే సాహసంతో ఓ యువకుడు చకచకా స్తంభం ఎక్కేసి.. ఆ వ్యక్తికి సీపీఆర్‌ చేశాడు. ‘గోల్డెన్‌ అవర్‌’లో అందిన సాయంతో అతడి ప్రాణాలు నిలిచాయి.

ఈ ఘటనలో మామకు అల్లుడే ప్రాణ దానం చేశాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రానికి చెందిన రాజు ఎలక్ర్టీషియన్‌. వరుసకు ఆయన అల్లుడు సాయి అదే ప్రాంతంలో కరెంటు పనులు చేస్తుంటాడు. కంబదూరు సబ్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఓ విద్యుత్‌ స్తంభంపైకి రాజు ఎక్కారు. విద్యుత్‌ సరఫరా లేని లైన్‌ను సరిచేస్తుండగా, పొరపాటున పక్కనే విద్యుత్‌ సరఫరా అవుతున్న లైన్‌ను తాకాడు. దీంతో షాక్‌కొట్టి స్తంభంపైనే వాలిపోయాడు. ఇదంతా కింద ఉండి గమనిస్తున్న సాయి వెంటనే అప్రమత్తమయ్యాడు. క్షణాల్లో విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కేసి తన మామకు అక్కడే సీపీఆర్‌ చేశాడు.

అచేతనంగా ఉన్న ఆయనకు ఊపిరిపోశాడు. ఈలోగా ట్రాన్స్‌కో సిబ్బంది ఎక్స్‌కవేటర్‌ను తీసుకువచ్చి, రాజును సురక్షితంగా కిందకు దించారు. అక్కడి నుంచి కంబదూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాజు ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

- కల్యాణదుర్గం, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 28 , 2026 | 02:14 AM