Share News

మీరు సిద్ధమా..‘సర్‌’!

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:52 AM

సర్‌’... స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌! ఈ పేరు వింటేనే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ‘ఓట్లు గల్లంతైపోతాయ్‌’ అని జనంలోనూ భయాలున్నాయి.

మీరు సిద్ధమా..‘సర్‌’!

  • ఓటుకు చేటురాకుండా చూసుకోండి

  • 2002 జాబితాతో మ్యాపింగ్‌ తప్పనిసరి

  • సొంతంగా లేదా తల్లిదండ్రులు/కుటుంబీకులకు అప్పట్లో ఓటు ఉండాలి!

  • లేకపోతే... 12రకాల ధ్రువీకరణల్లో ఒకటి తప్పదు

  • చిరునామా మారితే మరింత అప్రమత్తత అవసరం

  • బీఎల్‌వోను మీరే సంప్రదించడం ఉత్తమం

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

‘సర్‌’... స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌! ఈ పేరు వింటేనే దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ‘ఓట్లు గల్లంతైపోతాయ్‌’ అని జనంలోనూ భయాలున్నాయి. ‘అర్హుల ఓట్లు ఎక్కడికీ పోవు’ అని ఎన్నికల కమిషన్‌ భరోసా ఇస్తున్నా, దీనిపై అనేక సందేహాలు! అప్రమత్తంగా లేకుంటే నిజంగానే మన ఓటు గల్లంతయ్యే ప్రమాదముంది. ఎందుకంటే... ‘నేను అసలైన ఓటరునే’ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనదే! ఇదే సమయంలో... కొత్త ఓటర్ల నమోదు, చిరునామాలో మార్పులు, తప్పుల సవరణ వంటివి కూడా సులువుగా చేసుకోవచ్చు. ‘సర్‌’లో ఏం జరుగుతుంది, ఓటరుగా మనం చేయాల్సిందేమిటి? కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో...

  • ఏమిటీ ‘సర్‌’?

బోగస్‌ ఓట్లు, ఒకే వ్యక్తి ఒకటికి మించిన ఓట్లు... వీటి ఏరివేతే సర్‌ లక్ష్యం. ఒకరకంగా చెప్పాలంటే... ఇది ఓటర్ల జాబితా ప్రక్షాళన! అంతకుముందు 2002లో దేశవ్యాప్తంగా సర్‌ జరిగింది.

  • ఇప్పుడేం చేస్తారు?

2002నాటి ఓటర్ల జాబితాయే నేడు ప్రామాణికం! అప్పటికి దేశంలో ఎక్కడ మీకు ఓటు ఉన్నా ఓకే! ఆ నియోజకవర్గం, ఓటు నంబరు ఇస్తే... ఇప్పుడూ ఓటు భద్రంగా ఉంటుంది. మరి... 2002నాటికి ఓటు లేకపోతే ఏం చేయాలి? ఆ తర్వాత ఓటరుగా నమోదు చేయించుకుని ఉంటే పరిస్థితి ఏమిటి? 2002 సర్‌ ఓటర్ల జాబితాలోని తమ కుటుంబ సభ్యులు/రక్తసంబంధీకుల్లో (నాన్నమ్మ, తాత, తల్లి, తండ్రి, భార్య లేదా భర్త) ఏ ఒక్కరి ఓటు ఉన్నా, ఆ వివరాలు ఇస్తే సరిపోతుంది. ‘2002నాటి సంగతి ఎలా తెలుస్తుంది?’ అనే ప్రశ్నకు కూడా ఈసీ సమాధానం ఇచ్చింది. http://www.eci.gov.in/ వెబ్‌ సైట్‌లోకి వెళ్లగానే కుడివైపు పై భాగంలో ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ లాస్ట్‌ సర్‌’ అన్న అప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే మరొక ట్యాబ్‌ ఓపెన్‌ అవుతుంది. దానిలో ‘సెర్చ్‌ బై ఎలక్టర్‌ డీటెయిల్స్‌’, ‘సెర్చ్‌ ఇన్‌ లాస్ట్‌ సర్‌ ఈ రోల్‌’ అన్న ఆప్షన్‌నుగాని ఎంచుకొని వివరాలు తెలుసుకోవచ్చు.


  • 2002 సర్‌ జాబితాలో మీరు, మీ తల్లిదండ్రులు లేకపోతే...

2002లో జరిగిన సర్‌లో మీరు, మీ తల్లిదండ్రులు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. మీ/మీ తల్లిదండ్రులకు సంబంధించి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాలలో దేనిని సమర్పించినా సరిపోతుంది. ఆధార్‌, రేషన్‌ కార్డు, టెన్త్‌ మార్కుల లిస్టు, పెన్షన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివాటిలో ఏదో ఒకటి చూపించవచ్చు. ఆయా వివరాలను ఎన్యూమరేషన్‌ ఫారంలో నింపి బీఎల్‌ఓకు ఇవ్వాలి. ‘సర్‌ ఓటర్ల జాబితా నుంచి పై ఓటరు పేర్కొన్న వివరాలను సరిచూసుకున్నాను’ అని బీఎల్‌ఓ కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఏ దశలోనైనా ఓటరు లేదా బీఎల్‌ఓ ఉద్దేశ పూర్వకంగా తప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.

  • మీ ఓటుకు ఎప్పుడు చేటు?

2002 సర్‌ ఓటర్ల జాబితాలో మీ పేరు, మీ తల్లిదండ్రులు/రక్తసంబంధీకుల పేర్లు లేకున్నా... మీరు ఈ దేశ పౌరులే అని నిరూపించే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కటీ చూపించలేక పోయినా... ఓటు పోయినట్లే. అలాగే రెండు, మూడు రాష్ర్టాలు, నియోజకవర్గాల్లో ఓట్లు ఉంటే... అవన్నీ రద్దవుతాయి. ప్రస్తుతం నివసిస్తున్న చోట నమోదు చేసుకున్న ఓటు ఒక్కటే మిగులుతుంది. ఒకటికి మించి ఉన్న ఓట్లను గుర్తించి తొలగించేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తారు.

  • రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం మారితే ఏం చేయాలి?

గత ఎన్నికలనాటికి మీ ఓటు ఎక్కడ ఉంటే అక్కడి బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ మీకు ఫోన్‌ చేస్తారు. మీకు ఫోన్‌ రాకపోతే, మీరే బీఎల్‌ఓను గుర్తించి ఫోన్‌ చేయడం ఉత్తమం. ఆ బీఎల్‌ఓకు... ప్రస్తుతం మీరు ఉంటున్న చిరునామా వివరించి, తగిన పత్రాలను సమర్పించాలి. బీఎల్‌ఓని గుర్తించడానికి http://electoralsearch.eci.gov.in వెబ్‌ సైట్‌లోకి వెళ్లాలి. మెయిన్‌ పేజీలోనే ‘సెర్చ్‌ బై ఎపిక్‌’, ‘సెర్చ్‌ బై డీటెయిల్స్‌’, సెర్చ్‌ బై మొబైల్‌ నంబర్‌’ అనే మూడు ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. దానిలో ఒక దానిని ఎంపిక చేసుకొని వివరాలు నింపితే మీ ఓటరు కార్డు నంబరు, వివరాలు వస్తాయి. దానిలో చివరి కాలమ్‌లో ‘వ్యూ డీటెయిల్స్‌’ అన్న ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే బీఎల్‌ఓ ఫోన్‌ నంబర్‌ తెలుస్తుంది. బీఎల్‌ఓకు ఫోన్‌ చేసి... ఇతర వివరాలు తెలుసుకుని, మిగిలిన ప్రక్రియ పూర్తి చేయవచ్చు.


  • ఎక్కడ అప్రమత్తత అవసరం

సర్‌ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంటింటి సర్వేలో భాగంగా బీఎల్‌ఓలు మీ ఇంటికి వచ్చినపుడు మీరు అందుబాటులో లేకపోతే... ‘ఈ ఓటరు ఇక్కడ ఉండటం లేదు’ అని బీఎల్‌ఓ నమోదు చేస్తే ఆ ఓటును తొలగించే ప్రమాదం ఉంటుంది. సర్‌ జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా రాజకీయ పార్టీలు కొన్ని ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. ఇలాంటపుడు విచారణ పేరుతో ఆ దరఖాస్తులను హోల్డ్‌లో పెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే... ఇదంతా కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌ద్వారా జరుగుతుంది కాబట్టి, ఆ వివరాలను ఇప్పటికిప్పుడు చూసుకోలేం. ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత వివరాలు చూసుకుని, తేడా ఉంటే మళ్లీ సరిదిద్దుకోవాలి.

  • కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందా?

సర్‌ జరుగుతున్నప్పటికీ నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆగదు. నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది. సర్‌ నడుస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తారు. 18 ఏళ్లు నిండినవారు నేరుగా సంబంధిత బీఎల్‌ఓ దగ్గరకు వెళ్లి ఫారం-6 ఇచ్చి ఓటు నమోదు చేయించుకోవచ్చు. లేదా బీఎల్‌ఓ మీ ఇంటికి వచ్చినప్పుడైనా ఓటును నమోదు చేసుకోవచ్చు.

  • ఓటరు కార్డు అడ్ర్‌సలో మార్పులు చేసుకోవచ్చా

ఓటరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి నివాసం ఉన్నట్లయితే.. స్థానిక చిరునామాకు తమ ఓటును మార్పించకోవచ్చు. ఇంటికి బీఎల్‌ఓ వచ్చినపుడు ఫారం-8ను అడిగి తీసుకొని చిరునామా మార్పులకు సంబంధించి వివరాలను పొందుపరచాలి. చిరునామా త్వరగతిన మార్చుకోవడానికి సర్‌ చక్కటి అవకాశం.

Updated Date - Jun 25 , 2026 | 03:52 AM