Share News

పెళ్లి కోసం సీఐఎస్ఎఫ్‌ అధికారి వేషం!

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:35 AM

సామాజిక మాధ్యమంలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకునేందుకు సీఐఎస్ఎఫ్‌ అధికారి అవతారమెత్తాడో వ్యక్తి. ఎయిర్‌పోర్టులో ఫొటోలు దిగి కాబోయే భార్యకు పంపాడు.

పెళ్లి కోసం సీఐఎస్ఎఫ్‌ అధికారి వేషం!

  • అంతలోనే పట్టుబడిన శ్రీకాకుళం వాసి

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘటన

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమంలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకునేందుకు సీఐఎస్ఎఫ్‌ అధికారి అవతారమెత్తాడో వ్యక్తి. ఎయిర్‌పోర్టులో ఫొటోలు దిగి కాబోయే భార్యకు పంపాడు. ఆ తర్వాత కొంతసేపటికే అతని గుట్టురట్టైంది. ఈ సంఘటన మంగళవారం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ పవన్‌కుమార్‌ కథనం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణకు గతంలో ఒక యువతితో పెళ్లి జరిగింది. అయితే మనస్పర్థాల కారణంగా ఆమెతో విడాకులు అయ్యాయి. ఈ క్రమంలో బాలకృష్ణ సామాజిక మాధ్యమాల్లో పలువురు యువతులతో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇన్‌స్టాలో ఒక అమ్మాయి పరిచయం కాగా, ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ యువతి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి చేస్తామని చెప్పడంతో నిందితుడు ఆన్‌లైన్‌లో సీఐఎస్ఎఫ్‌ దుస్తులు ఆర్డర్‌ చేశాడు. మంగళవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఆ దుస్తులతో ఫొటోలు దిగి కాబోయే భార్యకు పంపాడు. ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో ఉన్న బాత్‌రూంలో ఆ దుస్తులు మార్చుకుంటుండగా అక్కడే ఉన్న జీఎంఆర్‌ సిబ్బంది ఈ తతంగాన్ని గమనించి వెంటనే సీఐఎస్ఎఫ్‌ అధికారులకు సమాచారం అందించారు. వారు బాలకృష్ణను స్ధానిక పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Apr 15 , 2026 | 05:36 AM