ఏడుగురు మత్స్యకారులు సేఫ్.. సీఎం చంద్రబాబు హర్షం
ABN , Publish Date - Aug 26 , 2026 | 08:53 PM
సముద్రంలో గల్లంతైన ఏడుగురు ఏపీ మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. పశ్చిమ బెంగాల్ తీరంలోని శంకర్‌పూర్ సమీపంలో వారి పడవను అధికారులు గుర్తించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు..
అమరావతి, ఆగస్టు 26: సముద్రంలో గల్లంతైన ఏడుగురు ఏపీ మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 3న కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ సాంకేతిక లోపానికి గురై, బలమైన గాలుల కారణంగా సముద్రంలో గల్లతైంది. దీంతో మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ, కోస్ట్‌గార్డ్, కేంద్ర మెరైన్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. చివరకు పశ్చిమ బెంగాల్‌లోని శంకర్‌పూర్ సమీపంలో పడవతో పాటు ఏడుగురు మత్స్యకారులను అధికారులు గుర్తించారు. వారి ఆచూకీ లభించిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడటంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సీఎం ఇప్పటికే మూడు సార్లు సమీక్ష నిర్వహించి, గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యల్లో సమన్వయంతో పనిచేసిన అధికార యంత్రాంగం, నేవీ, కోస్ట్‌గార్డ్, కేంద్ర మెరైన్ విభాగాలకు సీఎం అభినందనలు తెలిపారు. మత్స్యకారులను త్వరగా స్వస్థలాలకు తీసుకొచ్చేలా చర్యలు కొనసాగుతున్నాయి.