Share News

వారంపాటు అనాథలకు సేవ చేయండి

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:51 AM

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఏలూరు జిల్లా లింగపాలెం మండల తహసీల్దార్‌ నజీమ్‌ముల్లీసాకు వారంపాటు అనాథ శరణాలయంలో సేవ చేయాలని ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.

వారంపాటు అనాథలకు సేవ చేయండి

  • కోర్టు ధిక్కరణ కేసులో తహసీల్దార్‌కు హైకోర్టు ఆదేశం

ఏలూరు క్రైం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఏలూరు జిల్లా లింగపాలెం మండల తహసీల్దార్‌ నజీమ్‌ముల్లీసాకు వారంపాటు అనాథ శరణాలయంలో సేవ చేయాలని ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. సింగగూడెం పరిధిలోని ఆర్‌ఎస్‌ నంబర్‌ 228/1లో 1.53 సెంట్ల వ్యవసాయ భూమి పంతం శ్రీను తాత వీరయ్య నుంచి తన తండ్రి ముత్యాలకు, ముత్యాల సోదరుడు సుబ్బారావుకు సంక్రమించింది. అయితే వీరయ్య పేరుతో జారీ అయిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాన్ని రద్దు చేసి వారి వారి వాటాల ప్రకారం కొత్త పాస్‌ పుస్తకాలు జారీ చేయాలని కోరారు. రెవెన్యూ డివిజినల్‌ అధికారి విచారణ జరిపి ఆ విధంగానే నిర్ణయించి ఉత్వర్వులు జారీ చేశారు. ఆర్డీవో ఉత్తర్వులను తహసీల్దార్‌ అమలు చేయకపోవడంతో పంతం శ్రీను హైకోర్టును ఆశ్రయించారు. క్షేత్రస్థాయి విచారణలో సుబ్బారావు కుమారుడు ప్రభుదాసుకు, శ్రీను మధ్య వాటాల విషయంలో వివాదాలు ఉండడంతో వారు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో పాస్‌ పుస్తకాలు జారీ చేయలేకపోయామంటూ తహసీల్దార్‌ కోర్టుకు వివరించారు.

కోర్టు పరిశీలన జరిపి కేవలం ఆర్‌ఎస్‌ నంబర్‌ 228/2 మాత్రమే వివాదం ఉందని 228/1కి ఎలాంటి వివాదం లేని కారణంగా పాస్‌ పుస్తకాలు జారీ చేయాలంటూ 2025 నవంబర్‌ 17న ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేసే ఉద్దేశం తనకు లేదని తహసిల్దార్‌ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ శ్రీను కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కింద హైకోర్టులో ఈ ఏడాది జూలైలో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణను జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు చేపట్టారు. లింగపాలెం తహసీల్దార్‌ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని గుర్తించి కోర్టు ధిక్కరణ చట్టం 1971 సెక్షన్‌ 10 నుంచి 12 ప్రకారం ఈ నెల 21న ఆయనకు ఏడు రోజులు సాధారణ జైలు శిక్ష విధించింది. తహసీల్దార్‌ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయమూర్తి శిక్ష సవరించారు. ఈ నెల 22 నుంచి తహసీల్దార్‌ నజీమ్‌ముల్లీసా ఏడు రోజులపాటు ఏదైనా అనాథ శరణాలయంలో సేవ చేయాలని, సేవ చేసినట్టు రుజువులను అక్టోబరు ఒకటో తేదీన కోర్టులో సమర్పించాలని, రూ.రెండు వేలు జరిమానా హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీకి చెల్లించాలని తీర్పు వెలువరించారు.

Updated Date - Sep 24 , 2026 | 06:51 AM