అనంతబాబు భార్య ఎక్కడ?
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:56 AM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
పరారీలో ఉన్న అనంత లక్ష్మీదుర్గ కోసం ముమ్మర గాలింపు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో పాత్ర ఉందని తేలడంతో అరెస్టుకు యత్నాలు
ఇరుక్కుపోయినట్లు తెలిసి ముందే పరార్
భార్యభర్తలిద్దరూ కలిసే హత్యచేసినట్లు నిర్ధారించిన పోలీసులు
కాకినాడ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుబంధ చార్జిషీటులో పేర్కొన్న పోలీసులు.. వాటికి ఆధారాలనూ జతచేశారు. ఏ-2గా చేర్చి ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఆమె పరారీలో ఉన్నారు. ఆమె స్వస్థలం అడ్డతీగలలో గానీ, అటు కాకినాడలోని అపార్ట్‌మెంట్‌లో గానీ లేరని పోలీసులు గుర్తించారు. ఎక్కడ దాక్కున్నారనేది ఆరా తీస్తున్నారు. బంధువుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరినే ఏ-1గా నాడు పోలీసులు చేర్చారు. అయితే అందులో ఆయన భార్య పాత్ర కూడా ఉందనేందుకు ఆధారాలున్నా దాచిపెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో, చార్జిషీటులో ఆమె పాత్ర లేకుండా చేశారు.
అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు విచారణ వేగం పుంజుకోవడం, లోతుగా దర్యాప్తు చేయడానికి రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం అనుమతించడంతో పోలీసులు సమగ్రంగా విచారించారు. హత్యలో అనంతబాబు భార్య పాత్ర ఉన్నట్లు పక్కా ఆధారాలు సాధించి మంగళవారం కోర్టులో దాఖలుచేసిన అనుబంధ చార్జిషీటుతో వాటిని జతచేశారు. భార్యాభర్తలిద్దరూ పథకం ప్రకారమే దళితుడైన తమ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారని తేల్చారు. హత్యకు ముందు అనంతబాబుతో కలిసి ఆయన భార్య కూడా కారులో వెళ్లినట్లు నిర్ధారించారు. వారిద్దరూ కాకినాడ ఎన్‌ఎ్‌ఫసీఎల్ వెనుకగేటు సమీపంలోని డంపింగ్‌యార్డు వద్ద హత్య చేసినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ‘అనంతరం మృతదేహాన్ని తమ కారులో ఎక్కించుకుని అనంతబాబు, ఆయన భార్య తాము నివసించే శంకర్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.
హత్య తర్వాత అనంతబాబు మృతుడి తండ్రి, సోదరుడికి పది సార్లు ఫోన్లు చేశాడు. అదే సమయంలో అనంతలక్ష్మీదుర్గ 2022 మే 19న రాత్రి 10.23 గంటలకు రెండు నిమిషాలు, 10.32 గంటలకు 2.17 నిమిషాలు, హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని డోర్‌డెలివరీ చేసిన అనంతబాబు పారిపోయిన తర్వాత తెల్లవారుఝామున 4.01 గంటలకు అనంతబాబుకు ఫోన్ చేసి 1.53 నిమిషాలు మాట్లాడినట్లు కాల్ రికార్డు ద్వారా నిర్ధారణ అయింది. ఆ రోజు రాత్రి 10.20కు కాకినాడలోని తమ శంకర్ టవర్స్ 401 ఫ్లాట్ నుంచి అనంతబాబు, ఆయన భార్య కారులో బయటకు వెళ్లారు. అక్కడి నుంచి ఎన్‌ఎ్‌ఫసీఎల్ వెనుకగేటులో డంపింగ్ యార్డుకు చేరుకున్నారు. ఈ విషయం సమీప వీవీ కుమార్ గెస్ట్‌హౌస్ సీసీ ఫుటేజీలో రికార్డయింది. రాత్రి 10.37 గంటల నుంచి రాత్రి 12.05 గంటలకు వరకు డంపింగ్ యార్డులోనే ఉన్నారు.
ఈ గంటన్నర వ్యవధిలో సుబ్రహ్మణ్యాన్ని వీరిద్దరూ హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి మృతదేహంతో కారులో బయల్దేరి 20వ తేదీ తెల్లవారుఝామున 1.22 గంటలకు తమ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. మృతదేహాన్ని కారులోనే ఉంచి అపార్ట్‌మెంట్ మెయిన్‌గేటు ఎదుట పార్క్ చేసి తమ ఫ్లాట్‌లోకి వెళ్లారు. తర్వాత అనంతబాబు తన భార్యను అపార్ట్‌మెంట్‌లో వదిలి.. ఆనక దుస్తులు మార్చుకుని 1.31 గంటలకు మృతదేహాన్ని తానొక్కడే కారులో తీసుకుని రోడ్డు ప్రమాదం డ్రామా కోసం తొలుత ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు’ అని 56 పేజీల అనుబంధ చార్జిషీటులో పోలీసులు వివరించారు. అనంతబాబుకు నేరచరిత్ర ఉందని.. వివిధ పోలీసు స్టేషన్లలో మొత్తం 17 కేసులు ఉన్నట్లు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి