హెరిటేజ్‌పై చర్చకు సిద్ధం
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:26 AM
హెరిటేజ్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడుకు స్పష్టం చేశారు. ఇందాపూర్ డైయిరీకి, హెరిటేజ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు ఒక్క చిన్న ఆధారం ఉన్నా...
ఆధారాలతో రండి.. ఎన్ని రోజులైనా చర్చిద్దాం
హెరిటేజ్ ప్రతిష్ఠ దెబ్బతీయడానికి వైసీపీ కుట్ర
భారతీ సిమెంట్, ‘సాక్షి’లా ప్రభుత్వ సొమ్ము దోచుకోలేదు
వైసీపీ సభ్యుల ఆరోపణలపై అచ్చెన్న ఫైర్
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): హెరిటేజ్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడుకు స్పష్టం చేశారు. ఇందాపూర్ డైయిరీకి, హెరిటేజ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంటైనా, రోజైనా, పది రోజులైనా చర్చిద్దామని తెలిపారు. శాసన మండలిలో గురువారం కూడా వైసీపీ సభ్యులు హెరిటేజ్‌పై చర్చకు పట్టుబట్టారు. సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వారంతా చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నిన్న, మొన్న ప్రభుత్వం తరఫున స్పష్టమైన సమాధానం చెప్పామన్నారు. వైసీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా మంచి గుర్తింపు కలిగిన హెరిటేజ్ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి రోజూ ఈ సమస్యను సభలోకి తెస్తున్నారని ఆరోపించారు. బుధవారం సభలో తాను మాట్లాడిన అంశంపై మండలిలో ప్రతిపక్ష నేత ప్రెస్‌మీట్ పెట్టారని, ఆధారాలు చూపించకుండా చీజ్ ప్యాకెట్ చూపించి అదే నెయ్యి అని చెప్పారన్నారు. చీజ్‌కు, నెయ్యికి వ్యత్యాసం తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడారని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు కూడా ఇచ్చిందని, వీరికి ఏ మాత్రం సిగ్గు, విశ్వసనీయత ఉన్నా తమ సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని హెరిటేజ్ సంస్థ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు దోచే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌కు భారతీ సిమెంట్ సరఫరా చేసి మొత్తం దోపిడీ చేశారని, సాక్షి పేపర్‌కు కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చుకున్నారని, గ్రామాల్లో పేపర్లు కొనిపించారని అచ్చెన్న ఆరోపించారు. రోజూ ఒకే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి చైర్మన్‌ను కోరారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హెరిటేజ్‌పై చర్చకు ప్రభుత్వానికి భయంగా ఉందని ఆరోపించారు. హెరిటేజ్ వెనుక ఉండి ఇందాపూర్ డెయిరీ రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఒక పెద్ద పేపర్ తీసుకువచ్చి ఇది హెరిటేజ్ వెబ్‌సైట్‌లో ఉందని సభలో చూపించారు. ఇదే సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ, ఈలలు వేయడంతో చైర్మన్ సభను 5 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఇళ్ల నిర్మాణానికి గడువు పెంచాం: కొలుసు
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పీఎంఏవై(జీ) 2.0 కింద గృహాల అంశంపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కొలుసు పార్థసారథి బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2025 నుంచి గ్రామాల్లో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు రిజిస్ట్రేషన్ గడువును రెండుసార్లు పొడిగించిందని తెలిపారు. పీఎంఏవై 2.0 కింద యూనిట్ ధరలు పెంచే ప్రతిపాదనలు ఏమీ లేవని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో సభను పది నిముషాలు వాయిదా వేశారు. తర్వాత కూడా ప్రశ్నోత్తరాలు కొనసాగే పరిస్థితి లేకపోవడంతో చైర్మన్ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినట్లుగా ప్రకటించారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
‘మండలి’ 15 నిమిషాలే..!
శాసన మండలిలో వాయిదాల పర్వం కొనసాగింది. గురువారం కేవలం 15 నిమిషాలు మాత్రమే సమావేశమైంది. ఉదయం 10.04 గంటలకు సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్ రాజు మున్సిపల్ ఆడ్మినిస్ర్టేషన్ సవరణ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లు, పంచాయతీరాజ్ రూరల్ డెవల్‌పమెంట్ సవరణ, దేవదాయ శాఖకు సంబంధించిన రెండు బిల్లులను సభ ముందు ఉంచారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించేందుకు నాలుగు రోజుల సమయం కేటాయించామని, రెండు రోజులుగా సభకు అంతరాయం రావడంతో చర్చను ప్రారంభించలేదని తెలిపారు. బడ్జెట్‌పై చర్చకు సభ్యులు సహకరించాలని కోరారు. అనంతరం తిరుమల లడ్డూ కల్తీ, ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు రామసుబ్బారెడ్డి, వి.కల్యాణి, అరుణ్‌కుమార్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. హెరిటేజ్‌పై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. చైర్మన్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. వారి నినాదాలతో 10.15 గంటలకు చైర్మన్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ 10.57 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. మంత్రి పార్థసారథి సమాధానం చెబుతున్న సమయంలోనూ వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. సభ అర్డర్‌లో లేకపోవడంతో చైర్మన్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. రెండోసారి సభ 11.00 గంటల వరకే జరిగింది. అనంతరం 12.42 గంటలకు సభ ప్రారంభమైనా వైసీపీ సభ్యుల తమ నినాదాలతో ఒక్క నిమిషం వ్యవధిలోనే సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
క్షమాపణలు చెప్పను: బొత్స
ఇందాపూర్‌తో హెరిటేజ్‌కు సంబంధం ఉన్నట్లు తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హెరిటేజ్ పంపిన నోటీసులు తనకు ఇంకా అందలేదని, తాను వాస్తవాలే మాట్లాడానని, క్షమాపణలు చెప్పేది లేదని అన్నారు. గురువారం అసెంబ్లీ గేటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందాపూర్, హెరిటేజ్‌పై సభలో చర్చకు పట్టుబడితే తనకు లీగల్ నోటీసులు పంపడం హాస్యాస్పదమన్నారు. పది రోజుల క్రితం వరకు ఇందాపూర్ సంస్థ వివరాలు హెరిటేజ్ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. తొలుత ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరర్‌గా ఉండేదని, దీన్ని కో-మ్యానుఫ్యాక్చరర్‌గా మార్చారని అన్నారు. కేరళ ప్రభుత్వం హెరిటేజ్‌ను బ్యాన్ చేయడమేనా అవార్డు, హరియాణా రూ.లక్ష ఫైన్ వేయడమేనా రివార్డు అని ప్రశ్నించారు.