సత్యసాయి విద్య అందరికీ ఆదర్శం
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:17 AM
సత్యసాయి సంస్థలు అందిస్తున్న విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్య అందరికీ ఆదర్శమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు.
శ్రీసత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ
45వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
పుట్టపర్తి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సత్యసాయి సంస్థలు అందిస్తున్న విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్య అందరికీ ఆదర్శమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఏడో రోజు ఆదివారం సత్యసాయి 101వ జయంతి వేడుకలు కొనసాగాయి. పూర్ణచంద్ర హాల్‌లో శ్రీసత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 45వ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట సాయికుల్వంత్ సభామండపంలో సత్యసాయి మహాసమాధిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి ప్రసంగం సీడీతో స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలను గవర్నర్ బహూకరించారు. ఆయన ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యసాధనలో పట్టభద్రులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడంతోపాటు, సృజనాత్మకత, ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం అల్గారిథమిక్ యాక్సెసరీస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, వీసీ రాఘవేంద్ర ప్రసాద్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఘనంగా సన్మానించారు.
నేడు రాష్ట్ర పండుగా సత్యసాయి జయంతి
సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో వేడుకలకు ఏర్పాట్లుచేశారు.