Share News

లగ్జరీ రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:11 AM

రుషికొండ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మారుస్తామని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వెల్లడించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్‌గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పింది.

లగ్జరీ రిసార్ట్‌గా రుషికొండ ప్యాలెస్‌

  • మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం

  • పీపీపీ విధానంలో పెద్దసంస్థలకు ఇస్తాం

  • కల్చరల్‌ లేదా హెరిటేజ్‌ సెంటర్‌కు ఒక బ్లాక్‌

  • ప్రస్తుతం ప్యాలెస్‌ నిర్వహణకే భారీగా ఖర్చు

  • కొండకింద భూమిని కొన్ని సంస్థలు కోరాయి

  • త్వరలో అధికారికంగా నోటిఫికేషన్‌ ఇస్తాం

  • క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వెల్లడి

  • నివేదికను క్యాబినెట్‌కు ఇస్తామన్న సభ్యులు

  • భవనాలను పరిశీలించిన మంత్రులు

  • కేశవ్‌, దుర్గేశ్‌, డోలా, అధికారులు

విశాఖపట్నం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రుషికొండ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మారుస్తామని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వెల్లడించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్‌గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పింది. దీనిని పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)లో పెద్ద సంస్థలకు ఇస్తామని తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం సుమారు రూ. 450 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి నిర్మించిన ప్యాలె్‌సను ఏ విధంగా ఉపయోగించుకోవాలని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, జిల్లా కలెక్టర్‌తో కలిసి బుధవారం సాయంత్రం భవనాన్ని, దానిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం లాసన్స్‌బే కాలనీలోని యాత్రీ నివాస్‌లో వారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రుషికొండ ప్యాలె్‌సను ఆతిథ్య రంగానికే కేటాయించాలని ప్రాథమికంగా కమిటీ అభిప్రాయపడుతోందన్నారు.


విశాఖపట్నం ప్రజల సెంటిమెంట్‌ను కూడా గౌరవిస్తూ ఒక బ్లాక్‌ను కల్చరల్‌ లేదా హెరిటేజ్‌ సెంటర్‌ నిర్వహణకు కేటాయించేందుకు సూచన చేస్తామన్నారు. త్వరలోనే తమ నివేదికను ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో సమర్పిస్తామన్నారు. ఈ భవనం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరినప్పుడు పలు ప్రతిపాదనలు వచ్చాయని, కొందరు మానసిక వైద్యశాలగా మార్చాలని, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌గా ఉంచాలని, కొందరైతే కూల్చేయాలని కూడా సూచించారన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకు రిసార్ట్‌గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పారు. భవనం నిర్వహణకు నెలకు రూ.25 లక్షలు, అందులో విలువైన వస్తువుల నిర్వహణకు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతోందన్నారు. కొన్ని సంస్థలు రుషికొండ కింద ఉన్న భూమి కూడా ఇస్తే అభివృద్ధి చేస్తామని కోరాయని, త్వరలో అధికారికంగా నోటిఫికేషన్‌ ఇచ్చి, ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తామని చెప్పారు.


ప్రజావేదిక కూల్చేసినట్లు ప్యాలె్‌సను కూల్చలేం

భవనంలో ఒక బాత్‌రూమ్‌ 450 చ.అ. విస్తీర్ణంలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు. గత ప్రభుత్వం సామాన్యుడికి సెంటు స్థలంలో 270 చ.అ. ఇల్లు ఇస్తామని చెప్పి, నాటి సీఎం తన బాత్‌రూమ్‌ మాత్రం అంతకు రెట్టింపు సైజులో కట్టుకోవడం దుర్మార్గమన్నారు. మార్బుల్‌ డిజైన్‌ కోసం చ.అ.కు రూ. 6,450 ఖర్చు చేశారని, బాత్‌టబ్‌ ధర రూ.12 లక్షలకు పైగా ఉందని, అందులో కమోడ్‌ విలువే రూ. 4-5 లక్షలు ఉంటుందని చెప్పారు. భవన నిర్మాణంలో భారీ డీవియేషన్లు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రుషికొండపై 58 గదులున్న హరిత రిసార్ట్‌ను కూలగొట్టిందని, అప్పట్లో ఆ రిసార్ట్‌ ద్వారా ఏడాదికి రూ. 7.5 కోట్ల ఆదాయం వచ్చేదని వెల్లడించారు. ఏపీటీడీసీ దీనివల్ల చాలా నష్టపోయిందన్నారు. ప్రస్తుతం నిర్మించిన భవనాన్ని పీపీపీ విధానంలో లీజుకు ఇచ్చినా ప్రభుత్వం నియంత్రణ ఉంటుందని స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, శంకుస్థాపన రాయి మీద ‘రీ డెవల్‌పమెంట్‌ రిసార్ట్‌’ అని రాసి, లోపల ప్యాలెస్‌ కట్టి ప్రజలను వంచించారని మండిపడ్డారు. వారు ప్రజావేదిక కూల్చివేసినట్టు తాము దీనిని కూల్చివేయలేమన్నారు. సామాన్య ప్రజలకు, ప్రకృతి ప్రేమికులకు రుషికొండ ప్యాలెస్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jun 18 , 2026 | 03:13 AM