దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉన్నా సమాధానం ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:26 AM
రెవెన్యూ అంశాలపై సమాచార హక్కు చట్టం దరఖాస్తుల విషయంలో ఆర్టీఐ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అర్జీదారులు నిర్దిష్ట అంశాలను ప్రశ్నల రూపంలో అడిగినా అధికారులు విధిగా సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
రెవెన్యూశాఖకు ఆర్టీఐ కమిషన్ స్పష్టీకరణ
అర్జీదారుడికి బెదిరింపులపై విచారణకు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ అంశాలపై సమాచార హక్కు చట్టం దరఖాస్తుల విషయంలో ఆర్టీఐ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అర్జీదారులు నిర్దిష్ట అంశాలను ప్రశ్నల రూపంలో అడిగినా అధికారులు విధిగా సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కాశీరాళ్ల గ్రామానికి చెందిన టి.దేవదాసు అనే అర్జీదారుడు నిర్దిష్ట సర్వే నంబర్లు పేర్కొంటూ ఆ భూముల చెల్లుబాటుపై తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు ఇచ్చారు. రెండో దశలో అప్పీల్‌చేసినా సమాచారం ఇవ్వలేదు. దీంతో మూడోదఫా ఆర్టీఐ కమిషనర్ వద్ద అప్పీల్‌చేయగా కేసును రాష్ట్ర సమాచార కమిషనర్ చక్రవర్తి విచారించారు. దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉన్నందున సమాచారం ఇవ్వలేమన్న తహసీల్దార్ వాదన చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నిర్దిష వివరాలతో దరఖాస్తు వచ్చినప్పుడు, అందులో కొన్ని లోపాలున్నా, సమాచారచట్టం స్ఫూర్తిని కొనసాగిస్తూ దరఖాస్తులో కోరిన పూర్తిసమాచారం ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పలు అంశాలపై సమాచారం కోరినందుకు తనను అధికారులు బెదిరిస్తున్నారని దేవదాస్ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫిర్యాదును కమిషన్ తీవ్రంగా తీసుకుంది. విచారణ చేపట్టి, నివేదికను కమిషన్‌కు పంపించాలని ఆర్టీఐ కమిషనర్ చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు