రాజమండ్రి కల్తీ పాల ఘటన.. నిందితుడికి 14 రోజుల రిమాండ్..
ABN , Publish Date - Feb 24 , 2026 | 08:50 PM
రాజమండ్రి కల్తీ పాల కేసులో నిందితుడు అడ్డాల గణేష్‌ను త్రీ టౌన్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది..
రాజమండ్రి, ఫిబ్రవరి 24: కల్తీ పాల కేసులో నిందితుడు అడ్డాల గణేష్‌ను త్రీ టౌన్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి మిల్క్ డెయిరీలో సేకరించిన ఆధారాలతో సహా గణేష్‌ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు గణేష్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
యూరియా, డిటర్జెంట్ పొడి, నూనెతో కల్తీ..
పాల వ్యాపారి గణేష్ వరలక్ష్మి మిల్క్ డెయిరీని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నాడని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, లాభాపేక్షతో పాలల్లో నీళ్లు కలిపి ప్రజలకు పోసేవాడని అన్నారు. ఈ నెల 14వ తేదీన పాలు తక్కువగా సేకరించడం వల్ల పాలు చిక్కగా కనిపించేందుకు యూరియా, డిటర్జెంట్ పొడి, నూనె వంటి పదార్థాలు కలిపి కల్తీ చేశాడన్నారు. కల్తీ చేసిన పాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల కూలెంట్ ఆయిల్ లీకై పాలు కలుషితమయ్యాయని తెలిపారు.
కాగా, కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం మృతుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. కల్తీ పాల ఘటనకు సంబంధించి ప్రస్తుతం 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలోఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి
మీ పరిశీలనకు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..