రిజర్వాయర్లకు ‘వానల’ వరం!
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:37 AM
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రిజర్వాయర్లకు వరంగా మారాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈనెల 23 నాటికి 29 రిజర్వాయర్లలో నీటి మట్టాలు 101 టీఎంసీలు ఉండగా, శనివారానికి అవి 21 టీఎంసీల మేర పెరిగాయని గుర్తించింది.
భారీగా పెరిగిన నీటి మట్టాలు..19శాతం తగ్గిన లోటు
పెరిగిన నీటిని సద్వినియోగం చేసుకోవాలి: సీఎం
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రిజర్వాయర్లకు వరంగా మారాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈనెల 23 నాటికి 29 రిజర్వాయర్లలో నీటి మట్టాలు 101 టీఎంసీలు ఉండగా, శనివారానికి అవి 21 టీఎంసీల మేర పెరిగాయని గుర్తించింది. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన 50 శాతం వర్షపాత లోటు తాజా వర్షాలతో 31శాతానికి తగ్గింది. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.80 శాతం లోటు ఉండగా, రాయలసీమలో 42శాతం లోటు ఉంది. ఈ వివరాలను శనివారం సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబుకు అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టుల పరిధిలో 5టీఎంసీలు; కాకినాడ, పోలవరం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని 18 రిజర్వాయర్లలో 16టీఎంసీల చొప్పున పెరిగినట్టు వివరించారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి పరివాహకంలో నీటి ప్రవాహాలు గతంతో పోల్చితే పెరిగాయన్నారు. గొట్టా బ్యారేజ్‌లో ఈనెల20 నాటికి 7,214 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 25న 47,100 క్యూసెక్కులకు పెరిగింది. నారాయణపురం ఆనకట్టకు ఇన్‌ఫ్లో 2,100నుంచి 49,800 క్యూసెక్కులకు పెరిగింది. మద్దువలస ప్రాజెక్టులో గతంలో 918 క్యూసెక్కులుంటే.. ప్రస్తుతం 18వేల క్యూసెక్కులకు, తోటపల్లి బ్యారేజ్‌కి గతంలో 2,484 క్యూసెక్కులు ఉండగా, ప్రస్తుతం 23,250 క్యూసెక్కులకు ప్రవాహం పెరిగిందని సీఎంకు అధికారులు చెప్పారు. గోదావరిప్రాంత రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు పెరిగాయన్నారు. దీంతో పెరిగిన నీటి మట్టాలను సద్వినియోగం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు