పూడి శ్రీహరికి షాక్
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:34 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్ చేసి అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, జి.గిరీశ్‌కుమార్ రెడ్డిలకు రిమాండ్ ...
కుప్పం కోర్టు రిమాండ్ నిరాకరణ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు
మరో నిందితుడు గిరీశ్‌కుమార్ రెడ్డికీ వర్తింపు
ఇద్దరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్ చేసి అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, జి.గిరీశ్‌కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రతివాదులు పూడి శ్రీహరి, గిరీశ్‌కుమార్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెల్లడించిన కొద్దిసేపటి తరువాత శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరై.. కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. తదుపరి విచారణ వరకు నిందితులను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాక వాదనలు వినాలని కోర్టును ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. రిమాండ్‌ను తిరస్కరిస్తూ విచారణ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము సస్పెండ్ మాత్రమే చేశామని, వాటిని రద్దు చేయలేదని గుర్తు చేశారు. ఉత్తర్వులను రద్దు చేసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసేందుకు వీలు ఉంటుందన్నారు. నిందితులను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని సీనియర్ న్యాయవాది మరోసారి ఆందోళన వ్యక్తం చేయగా.. అరెస్ట్ చేయనీయండి ఏమి జరుగుతుందో చూస్తారని న్యాయమూర్తి హెచ్చరించారు. కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కుప్పం అర్బన్ పోలీసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు లంచ్‌మోషన్లుగా విచారణకు స్వీకరించింది. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. బీఎన్‌ఎ్‌సఎస్ చట్టంలోని సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారని, నోటీసులు తీసుకొనేందుకు పిటిషనర్లు నిరాకరించారని తెలిపారు.
రిమాండ్ రిపోర్టులో ఈ వివరాలు ప్రస్తావించినా కుప్పం కోర్టు పట్టించుకోలేదన్నారు. నోటీసు అందుకునేందుకు నిరాకరిస్తే నిందితులను అరెస్ట్ చేయవచ్చని ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. నిందితుడు శ్రీహరి ఉద్దేశపూర్వకంగా సీఎం మార్ఫింగ్ ఫొటోను సృష్టించారని తెలిపారు. శ్రీహరి మొత్తం 14 మెయిల్ ఐడీలను వినియోగిస్తూ అనేక సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎవరి ప్రోద్భలంతో అనుచిత పోస్టులు పెడుతున్నారో తేల్చేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉందన్నారు. వారికి రిమాండ్ నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరగా న్యాయమూర్తి ఏకీభవించారు.
శ్రీహరి అరెస్ట్ విషయంలో కౌంటర్ దాఖలు చేయండి
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉన్న కేసుల్లో చట్టనిబంధనలు అనుసరించాల్సిందేనని పోలీసులకు హైకోర్టు తేల్చిచెప్పింది. వ్యక్తుల అరెస్ట్ సమయంలో పోలీసులు చట్టనిబంధనలు పాటించడంలేదని పేర్కొంది. తమ వారిని అక్రమంగా నిర్బంధించారని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన వెంటనే తమ అదుపులో ఉన్నవారిని విడుదల చేయడమో లేదా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచడమో చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పూడి శ్రీహరి అరెస్ట్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మెడమల్లి బాలాజీతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పూడి శ్రీహరిని కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయ న డ్రైవర్ పోతల సింహాచలంనాయుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవా రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా శ్రీహరి తరఫున న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. సహాయ ప్రభుత్వ న్యాయవాది కృష్ణప్రణీత్ వాదనలు వినిపిస్తూ.. శ్రీహరి అరెస్ట్ విషయంలో చట్టనిబంధనలు పాటించామన్నారు.