Share News

విద్యార్థులకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ పాఠాలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:53 AM

విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు లెక్కల మాస్టారు అవతారం ఎత్తారు. హైస్కూలు విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు.

విద్యార్థులకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ పాఠాలు

  • ఈడుపుగల్లు పాఠశాలలో గణితం బోధించిన శ్యామలరావు

విజయవాడ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు లెక్కల మాస్టారు అవతారం ఎత్తారు. హైస్కూలు విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. శనివారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల, పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాల విద్యశాఖ డైరెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావుతో కలిసి తరగతి గదులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల చిన్నారులతో ముచ్చటిస్తూ వారి చదువు, సామర్థ్యాలను తెలుసుకున్నారు. తెలుగు, ఆంగ్లం, గణితంలో అక్షరాలు, అంకెలను గుర్తించడం, రాయడం, చదవడం వంటి కార్యకలాపాలను వారితో స్వయంగా చేయించారు. మూడో తరగతి విద్యార్థిని హారిక గీసిన చిత్రాలను చూసి అభినందించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థుల కోసం సిద్ధం చేసిన భోజనాన్ని, మిల్లెట్‌ చిక్కీని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించిన అధికారులకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. పదో తరగతి విద్యార్థులతో ‘మిషన్‌ మార్చ్‌’ సన్నాహకాలపై చర్చించారు. వారికి బోర్డుపై స్వయంగా గణితం బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 03:54 AM