Share News

ప్రాణ నష్టం నివారణే లక్ష్యం!

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:19 AM

రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్‌’ అతి తీవ్ర తుఫాన్‌ ముప్పును ఎదుర్కోవటానికి ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగమంతా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

ప్రాణ నష్టం నివారణే లక్ష్యం!

  • నేటి మధ్యాహ్నం నుంచి తీర రోడ్లపై రాకపోకలు బంద్‌

  • 11 జిల్లాలకు సహాయక బృందాలు.. తుఫాన్‌పై ప్రభుత్వం సన్నద్ధత

  • ఆర్టీజీఎస్‌లో అధికారుల నిరంతర పర్యవేక్షణ

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్‌’ అతి తీవ్ర తుఫాన్‌ ముప్పును ఎదుర్కోవటానికి ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగమంతా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ నుంచి ఆయా శాఖల అధికారులతో ఆర్టీజీఎస్‌ కార్యదర్శి భాస్కర్‌ కాటంనేని, సీఈవో ప్రఖర్‌జైన్‌ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో తీసుకున్న ముందస్తు చర్యలు, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు వివరిస్తున్నారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 11 ప్రభావిత జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. లోతట్టు, ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా గుర్తించిన సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేపట్టారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 2,460 రెవెన్యూ గ్రామాలు, 92 పట్టణ ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉండనుందని అంచనా వేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 1,763 షెల్టర్లను గుర్తించారు. జిల్లా, మండల స్థాయిల్లో మొత్తం 2,907 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు 3,185 మంది నోడల్‌ అధికారులను నియమించారు. 2,107 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల పరిధిలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు.


తాగునీటి సమస్య తలెత్తకుండా 2,613 అత్యవసర నీటి ట్యాంకులను సిద్ధం చేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బీచ్‌లను మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తీర ప్రాంత రహదారులపై రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. మత్స్యకారులకు చెందిన 30,043 పడవలను రేవుల్లో నిలిపివేశారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించడానికి ఉడ్‌ కటింగ్‌ మిషన్లు తెప్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 06:19 AM