Share News

వైసీపీ బరితెగింపు

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:07 AM

పరిషత్‌ నామినేషన్ల ఘట్టం రెండవరోజైన గురువారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు అల్లర్లు, ఆందోళనలకు విశ్వప్రయత్నాలు చేశారు. కనిగిరి, హెచ్‌ఎంపాడులలో అయితే ఆ పార్టీ నాయకులు దూకుడుగా వ్యవహరించి పోలీసులపై దాడికి యత్నించటమే గాక ఒక మహిళను విచక్షణారహితంగా కొట్టారు.

వైసీపీ బరితెగింపు
కనిగిరిలో బారీకేడ్లను నెట్టుకుని నామినేషన్‌ కేంద్రంలోకి చొచ్చుకుపోతన్న వైసీపీ కార్యకర్తలు

కనిగిరిలో కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం

టీడీపీ వర్గం మహిళపై దాడి

పొన్నలూరులో మాజీ మంత్రి హైడ్రామా

కొమరోలు, తాళ్లూరులలో కొత్త వ్యక్తుల హల్‌చల్‌

పలు మండలాల్లో ఎంపీపీల కోసం రాజీ సమాలోచనలు

పరిషత్‌ నామినేషన్ల ఘట్టం రెండవరోజైన గురువారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు అల్లర్లు, ఆందోళనలకు విశ్వప్రయత్నాలు చేశారు. కనిగిరి, హెచ్‌ఎంపాడులలో అయితే ఆ పార్టీ నాయకులు దూకుడుగా వ్యవహరించి పోలీసులపై దాడికి యత్నించటమే గాక ఒక మహిళను విచక్షణారహితంగా కొట్టారు. పొన్నలూరులో మాజీమంత్రి సురేష్‌ పోలీసుల కాళ్లు మొక్కుతున్నట్లు నటించి హైడ్రామా సృష్టించారు. కొమరోలు, తాళ్లూరు మండలాల్లో కొత్త వ్యక్తులు హల్‌చల్‌ చేశారు. అయినా నామినేషన్ల ప్రక్రియ ఎక్కువ ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగే విధంగా యంత్రాంగం చూడగలిగింది. కొన్నిచోట్ల మాత్రం తమకు నామినేషన్‌ వేసే అవకాశం ఇవ్వకుండా పోలీసుల సహకారంతో టీడీపీ వారు అడ్డంకులు సృష్టించారని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ కవ్వింపు చర్యలకు దిగడం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

పరిషత్‌ ఎన్నికల నామినేషన్లఘట్టంలో భాగంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు బారులు తీరారు. అయితే పథకం ప్రకారం కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు బరితెగించి వ్యవహరించటం చర్చనీయాంశమైంది. హనుమంతునిపాడులో లక్ష్మి అనే టీడీపీ కార్యకర్తను కిందపడేసి పొట్ట మీద తొక్కటంతో శరీరం లోపల తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరిలో మాజీ జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, హెచ్‌ఎంపాడులో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ, ఇతర నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అధికారులపై దూకుడుగా వ్యవహరించారు.

పోలీసులపైనే దాడులు

తొలుత కనిగిరిలో సుమారు 200 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు బారీకేడ్లను నెట్టుకుని నామినేషన్‌ కేంద్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ర్యాలీలు నిషిద్ధమని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక్కో నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థితోపాటు ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే లోపలికి పంపిస్తామని పోలీసులు సూచించారు. ఆ మేరకు సహకరించాలని నచ్చజెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితా తామంతా కార్యాలయాల్లోకి వెళ్లాల్సిందేనంటూ బారికేడ్లను పీకివేసి పోలీసులను తోచుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీలైనంత మేరకు లాఠీఛార్జ్‌ జరపకుండా వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. వైసీపీ శ్రేణులు వెనక్కు తగ్గకపోవటంతో లాఠీలు చేతబట్టారు. వాటిని వైసీపీ కార్యకర్తలు లాక్కుని పోలీసులపైనే తిరగబడ్డారు. వైసీపీ నాయకుడు కస్తూరిరెడ్డి కొంతమందిని తీసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు పరుగెత్తారు. అయితే సమీపంలో ఉన్న పోలీసులు కూడా అప్పటికే అక్కడకు చేరటంతో వారి ప్రయత్నం విఫలమైంది. అభ్యర్థి, ఇద్దరు ప్రతిపాదకులు మాత్రమే లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించినా అలా కుదరదు తామంతా మూకుమ్మడిగానే లోపలికి వెళ్లాలని వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి 2 గంటల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

టీడీపీ వర్గీయులపై దాడి

హెచ్‌ఎంపాడులో నామినేషన్ల స్వీకరణ కేంద్రంలోకి వైసీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీశ్రేణులు చొచ్చుకొచ్చారు. కార్యాలయం ముందుభాగంలోకి ఒక్కసారిగా వారు దూసుకురావటంతో అప్పటికే నామినేషన్లు వేసేందుకు అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థులు, ప్రతిపాదకులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ శ్రేణులు ఎక్కువమంది ఉండటంతో చేతికందిన టీడీపీ కార్యకర్తలపై ఝులుం ప్రదర్శించారు. లక్ష్మి అనే టీడీపీ కార్యకర్తను తోసివేయటంతో కిందపడిపోయింది. ఆమె పొట్టపై కాళ్లతో తొక్కి హింసకు గురిచేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత ఆమెను చికిత్స కోసం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆమెను పరామర్శించి అవసరమైన మెరుగైన చికిత్సకోసం గుంటూరులోని తన వైద్యశాలకు పంపాలని డాక్టర్లకు సూచించారు.

పొన్నలూరులో హైడ్రామా

కొండపి నియోజకవర్గం పొన్నలూరులో హైడ్రామా కొనసాగింది. ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి అయిన మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌ అక్కడకు వచ్చి ఆవేశంగా అరవటంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్దఎత్తున గుమికూడారు. టీడీపీ నాయకుడు సాంబయ్య ఆధ్వర్యంలో కూడా కార్యకర్తలు భారీగా చేరారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఇరుపార్టీల వారు నామినేషన్లు వేసేందుకు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే అప్పటికే తెలుగుదేశం పార్టీ వారు కొందరు కార్యాలయంలోనే ఉన్నారంటూ వారిని కూడా బయటకు పంపాలని సురేష్‌ డిమాండ్‌ చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని మాత్రమే లోపలికి పంపామని పోలీసులు సమాధానమిచ్చారు. ఆ తర్వాత సురేష్‌ డ్యూటీలో ఉన్న డీఎస్పీ వద్దకు వచ్చి ‘నీ కాళ్లు మొక్కుతా మా వారిని నామినేషన్లు వేసేందుకు పంపండి’ అంటూ వేడుకుంటూ దానిని వీడియోలు తీయించటం, అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో తిప్పటం ద్వారా డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో ఒక ఎంపీటీసీకి నామినేషన్‌ వేసే విషయంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. సింగరాయకొండలో తొలిరోజే ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.


కొమరోలు, తాళ్లూరులలో..

గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు, దర్శి నియోజకవర్గం తాళ్లూరులలో నామినేషన్‌ కేంద్రాల వద్ద కొత్త వ్యక్తులు హల్‌చల్‌ చేయటం కనిపించింది. వారు వైసీపీ గూండాలని టీడీపీ వర్గీయులు, టీడీపీ గూండాలని వైసీపీ వర్గీయులు ఆరోపించారు. కొమరోలులో తొలిరోజు నామినేషన్‌ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ కార్యకర్త మీద దాడి జరిగింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగిపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించటం తదితర సంఘటనలపై కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ముఖ్య వైసీపీ నాయకులు గురువారం కనిపించకపోగా ఆ కింది నాయకుల హడావుడి కనిపించింది. టీడీపీ తరపున ముఖ్యనేతలంతా అక్కడ నిలబడి ఆ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించటం కనిపించింది. తాళ్లూరులో హల్‌చల్‌ చేసిన కొత్త వ్యక్తులు స్థానికులో ఎవరో ఏ పార్టీ వారో గుర్తించలేక ఇరుపార్టీలకు చెందిన మహిళలపై దూకుడుగా వ్యవహరించారు. దీంతో స్థానికుల్లో వ్యతిరేకత వచ్చింది. ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైపాలెం, కొనకనమిట్లలోను వైసీపీ శ్రేణులు నామినేషన్‌ కేంద్రానికి సమీపంలో కొద్దిసేపు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గంలోని వీవీపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. కాగా అద్దంకి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాలలో చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ప్రక్రియ సాఫీగా సాగింది.

కిందిస్థాయిలో రాజీ ప్రయత్నాలు

కాగా మండలాల్లో ఎంపీటీసీ స్థానాలలో పోటీ విషయంలో రాజీగా ముందుకుపోయే విధంగా పలుచోట్ల రాజీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా పశ్చిమప్రాంతంలోని పలు నియోజకవర్గాలలో ఈ పరిస్థితి నెలకొంది. టీడీపీకి ఎంపీపీ పదవి దక్కే విధంగా మెజారిటీ ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేసే అవకాశం ఇవ్వటం, కొన్ని ఎంపీటీసీ స్థానాలను వైసీపీ తీసుకునే విధంగా చర్చలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వైసీపీ ఇన్‌చార్జిలు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించలేమని తేల్చిచెప్పటంతో ఆ పార్టీలోని కిందిస్థాయి నాయకులు ఈ రాజీ ప్రయత్నాలకు శ్రీకారం పలికినట్లు తెలుస్తోంది. వైపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలలోని కొన్ని మండలాల్లో రాజీ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Updated Date - Oct 23 , 2026 | 12:07 AM