Share News

మార్కాపురం జడ్పీపై వైసీపీ దృష్టి

ABN , Publish Date - Oct 22 , 2026 | 03:28 AM

స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లా విషయాన్ని పక్కనపెట్టి మార్కాపురం జిల్లాపై వైసీపీ ఎక్కువ దృష్టి సారిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి వ్యూహాత్మకంగా ఉండటంతో వైసీపీకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రకాశం జడ్పీ విషయంలో కనీస ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించని వైసీపీ అధిష్ఠానం.. మార్కాపురం జడ్పీ చైర్మన్‌ విషయంలో అక్కడి నాయకులతో విస్తృత చర్చలు జరుపుతోంది.

మార్కాపురం జడ్పీపై వైసీపీ దృష్టి

మాజీ ఎమ్మెల్యేను రంగంలోకి దించిన వైనం

టీడీపీ నేతలకు స్పష్టతనిస్తున్న అధిష్ఠానం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లా విషయాన్ని పక్కనపెట్టి మార్కాపురం జిల్లాపై వైసీపీ ఎక్కువ దృష్టి సారిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి వ్యూహాత్మకంగా ఉండటంతో వైసీపీకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రకాశం జడ్పీ విషయంలో కనీస ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించని వైసీపీ అధిష్ఠానం.. మార్కాపురం జడ్పీ చైర్మన్‌ విషయంలో అక్కడి నాయకులతో విస్తృత చర్చలు జరుపుతోంది. మార్కాపురం ప్రాంతం తమకు కంచుకోటగా వైసీపీ భావిస్తుంటుంది. అయితే గత ప్రభుత్వంలో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏమాత్రం ప్రాధాన్య మివ్వలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాంతానికి ప్రత్యేక జిల్లాను ఇవ్వడంతో పాటు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించింది. హార్టికల్చర్‌ హబ్‌లో ఆ ప్రాంతాన్ని చేర్చింది. దీంతో ప్రజల్లో సానుకూలత పెరిగింది. తమ కంచుకోటకు బీటలు పడుతున్నాయన్న భావనతో కాబోలు వైసీపీ అధిష్ఠానం జోక్యం చేసుకుని ఆ ప్రాంత నాయకులను ఐక్యంగా ముందుకు నడిపేందుకు సిద్ధమైంది. తదనుగుణంగా రెండు దశాబ్దాల క్రితం ఎమ్మెల్యేగా పనిచేసిన ఉడుముల శ్రీనివాసరెడ్డిని జడ్పీ చైర్మన్‌ పదవికి పోటీ చేయాలంటూ వైసీపీ అధిష్ఠానం ఒత్తిడి చేసినట్లు తెలిసింది. తన సొంత కొనకనమిట్ల మండలం అన్‌రిజర్వ్‌డ్‌ కావడంతో జడ్పీటీసీ పదవికి బుధవారం ఆయన నామినేషన్‌ వేశారు. ఇప్పటికే గెలుపోటములకు అతీతంగా ఆ జిల్లాలోని పలువురు యువ నాయకులు జడ్పీ చైౖర్మన్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా అకస్మాత్తుగా ఉడుములను తెరపైకి తేవడం విశేషం. ప్రస్తుతం ఆయన అల్లుడు గిద్దలూరు వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన వియ్యంకుడు, సీనియర్‌ నాయకులు కేపీ కొండారెడ్డి వచ్చే ఎన్నికల్లో మార్కాపురం తమ కుటుంబానికే కావాలని డిమాండ్‌ చేస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం వైసీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు చాకచక్యంగా పావులు కదిపి కొండారెడ్డి కుటుంబ సమీప బంధువైన ఉడుములను తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. అదేసమయంలో గిద్దలూరు కూటమి పార్టీల మధ్య పొత్తులో భాగంగా బీజేపీకి లభించటంతో అక్కడ సఖ్యత లోపించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని గిద్దలూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనతో వైసీపీ అధిష్ఠానం అనుక్షణం నాయకులతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇలా అంతోఇంతో మంచి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఆశతో మార్కాపురం జిల్లాపై దృష్టిసారించిన వైసీపీ ప్రకాశం జిల్లా విషయంలో కనీస ఆసక్తి కూడా చూపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రకాశం జడ్పీ చైర్మన్‌ విషయంపై ఆ పార్టీ నాయకులు కూర్చుని మాట్లాడుకున్నది కూడా లేదు. ఆ పార్టీ పార్లమెంటు ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుమారుడి కోసం సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో మకాం వేశారు. స్థానికంగా నియోజకవర్గ ఇన్‌చార్జిల మధ్య కూడా సఖ్యత లేకపోవటంతోపాటు టీడీపీకి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బలమైన నాయకత్వం ఉండటంతో వైసీసీ తూతూమంత్రంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

Updated Date - Oct 22 , 2026 | 03:28 AM