విలువైన భూమిపై వైసీపీ నేత కన్ను
ABN , Publish Date - Apr 19 , 2026 | 03:16 AM
మార్కాపురం సమీపంలోని అల్లూరి పోలేరమ్మ ఆలయానికి దగ్గరలో విలువైన భూమిపై గిద్దలూరుకు చెందిన వైసీపీ నాయకుడి కన్ను పడింది. ఒక అగ్రిమెంట్ ఆధారంగా ఆ భూమి తనదేనని వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్లాట్‌లలోని రాళ్లను తొలగించారు.
ఆక్రమణకు యత్నం
అడ్డుకున్న ప్లాట్ల యజమానులు
ఇరువర్గాల ఘర్షణ
ఆ నేత పోలీసులకు అప్పగింత
రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్య
నిర్ధారించాక చర్యలు తీసుకుంటామన్న ఎస్సై
మార్కాపురం కలెక్టరేట్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం సమీపంలోని అల్లూరి పోలేరమ్మ ఆలయానికి దగ్గరలో విలువైన భూమిపై గిద్దలూరుకు చెందిన వైసీపీ నాయకుడి కన్ను పడింది. ఒక అగ్రిమెంట్ ఆధారంగా ఆ భూమి తనదేనని వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్లాట్‌లలోని రాళ్లను తొలగించారు. విషయం తెలుసుకున్న ప్లాట్‌ల యజమానులు అక్కడకు వెళ్లి వాదులాటకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే... మార్కాపురం మండలం నర్సింహాపురం ఇలాకాలో సర్వే నెంబరు 1/ఏలో ఉన్న 12 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ వేశారు. అందులోని ప్లాట్‌లను 240 మంది కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌లు కూడా జరిగాయి. ఇదేస్థలంలో గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లికి చెందిన వైసీపీ నాయకుడు ఎర్రం వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి తనకు 3.25ఎకరాలు ఉందని దాదాపు 18 ఏళ్ల కిందట రాసుకున్న అగ్రిమెంట్‌ను తీసుకొచ్చి ఆ ప్లాట్‌లోని రాళ్లను తొలగించడం ప్రారంభించారు. ఇది గమనించిన ప్లాట్ల యజమానులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు వెంకటరామిరెడ్డికి మద్దతుగా స్థానిక వైసీపీ నాయకులు కొందరు రావడంతో కోపోద్రిక్తులైన ప్లాట్ల యజమానులు కొందరు వారిపై చేయికూడా చేసుకున్నట్లు తెలిసింది. అయితే వెంకటరామిరెడ్డి కబ్జాకు పాల్పడుతున్నాడంటూ ఆయన్ను స్టేషన్‌లో అప్పగించేందుకు కొందరు నడిపించుకుంటూ తీసుకెళ్తుండగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడంతో రూరల్ ఎస్సై ఇరువర్గాల డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకు పంపారు. వారు ఇచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఎస్సై వేమన తెలిపారు.
ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన బాధితులు
బాధితులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. కబ్జాకు పాల్పడాలని చూసిన వ్యక్తి వద్ద ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్లని వారు ఆరోపించారు. మీకు అండగా ఉంటానని, అధికారులతో మాట్లాడి అక్రమార్కులపై చర్యలకు సిఫారసు చేస్తానని ఎమ్మెల్యే వారికి చెప్పారు. తొలగించిన ప్లాట్ల హద్దురాళ్లను పాతుకొని ఎవరి పనివారు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించేదిలేదని ఆయన వారికి భరోసా ఇచ్చి పంపించారు.