మున్సిపల్ కాలువను ఆక్రమించిన వైసీపీ నేత
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:54 PM
అధికారం లేకపోయిన ఓ వైసీపీ నేత అక్రమ నిర్మాణాలతో రెచ్చిపోతున్నాడు. చివరికి మున్సిపల్ కాలువను ఆక్రమించి మరీ గోడను నిర్మిస్తున్నాడు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న కాలువను నామరూపల్లేకుండా చేసేశాడు. అంతేకాక ఆ సమీపంలోని గృహాల వాళ్లు రాకపోకలు సాగిచేందుకు కూడా ఇబ్బందులు కలుగజేస్తున్నాడు.
స్థానిక పీర్లచావిడి సమీపంలో అక్రమ నిర్మాణం
పనులు నిలిపివేసిన అధికారులు
మార్కాపురం టౌన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అధికారం లేకపోయిన ఓ వైసీపీ నేత అక్రమ నిర్మాణాలతో రెచ్చిపోతున్నాడు. చివరికి మున్సిపల్ కాలువను ఆక్రమించి మరీ గోడను నిర్మిస్తున్నాడు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న కాలువను నామరూపల్లేకుండా చేసేశాడు. అంతేకాక ఆ సమీపంలోని గృహాల వాళ్లు రాకపోకలు సాగిచేందుకు కూడా ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థానికులు కొందరు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నారాయణరెడ్డి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ నడిబొడ్డున వైసీపీ నాయకుడు బరితెగించి మున్సిపల్ కాలువపై నిర్మాణాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారంటూ మందలించారు. వెంటనే స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న పనులను నిలుపుదల చేశారు. అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వ్యక్తిపై మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కాలువను, రోడ్డును ఆక్రమించి శాశ్వత నిర్మాణం
స్థానిక గొర్లగడ్డ ప్రాంతానికి చెందిన పీర్ల చావిడి సమీపంలో మొఘల్ సిరాజుతుల్లా బేగ్కు ఐస్ ఫ్యాక్టరీ ఉంది. దాని ఆనుకుని మున్సిపాలిటీకి చెందిన మురుగు కాలువ, సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సిరాజుతుల్లా బేగ్ ఐస్ ఫ్యాక్టరీని కూల్చివేశాడు. ఆ స్థలంలో నూతన నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇంత వరకు బాగానే ఉన్నా అతని స్థలంలో నిర్మాణం చేస్తుంటే విమర్శలకు తావుండేదికాదు. కానీ స్థలానికి పడమటి వైపు ఉన్న మున్సిపల్ కాలువను, సీసీ రహదారిని సుమారు మూడు అడుగుల మేర ఆక్రమించాడు. ఇదేం పద్ధతని పలువురు స్థానికులు అతన్ని అడిగినా నా ఇష్టం వచ్చినట్లు నిర్మాణం చేస్తానని చెప్పాడు. అంతేకాక పలువురిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థానికులు కొందరు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కలిసి అక్రమాన్ని వివరించారు. ఆక్రమణలు ఇదే విధంగా జరిగితే పక్కనే ఉన్న మదర్సాకు పిల్లలు ఏ విధంగా వెళ్లాలని వాపోయారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కందుల వెంటనే నిర్మాణాలు నిలుపుదల చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అప్రమత్తమైన టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు. కానీ అక్రమ నిర్మాణం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.