Share News

టీడీపీ అధిష్ఠానం దృష్టిలో యువ మహిళా నేతలు

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:29 AM

ప్రపంచవ్యాప్తంగా జన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కూడా స్థానిక సంస్థల్లో వివిధ పదవులకు ఎంపిక కోసం యువతీ, యువకులపై దృష్టి సారించింది. చురుగ్గా ఉంటున్న వారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీ అధిష్ఠానం దృష్టిలో యువ మహిళా నేతలు

అటు జడ్పీ, ఇటు ఒంగోలు డిప్యూటీ మేయర్‌ పదవులపై కసరత్తు

ప్రకాశం జడ్పీ చైర్మన్‌ విషయంలో మారుతున్న సమీకరణలు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ప్రపంచవ్యాప్తంగా జన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కూడా స్థానిక సంస్థల్లో వివిధ పదవులకు ఎంపిక కోసం యువతీ, యువకులపై దృష్టి సారించింది. చురుగ్గా ఉంటున్న వారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తదనుగుణంగా ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, అలాగే ఒంగోలు డిప్యూటీ మేయర్‌ పదవుల విషయంలో ఇద్దరు యువ మహిళల పేర్లను పరిశీల నలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దళితులకు రిజర్వు అయిన విషయం విదితమే. వలేటివారిపాలెం నుంచి గెలు పొందిన అంజిబాబు పేరు తొలి నుంచి పరిశీలనలో ఉంది. రెండు రోజుల క్రితం ఒంగోలు జడ్పీటీసీ ప్రభాకర్‌ పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. అయితే సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవిని ఇప్పటికే ఒంగోలుకు కేటాయిం చినందున మరో నియోజకవర్గానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు ఆధిష్ఠానం వచ్చినట్లు తెలిసింది. పైగా ఎస్‌సీ మాల సామాజికవర్గం వారికి కూడా ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇటు అంజిబాబుతో పాటు అటు ఎస్‌ఎన్‌పాడు జడ్పీటీసీగా గెలుపొందిన దార్ల సరస్వతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం అధిష్ఠానం దూతలు సరస్వతి బయోడేటాను తీసుకుని వివిధ కోణాల్లో సమాచారం సేకరించినట్లు తెలిసింది. సరస్వతి పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. మంగమూరుకు చెందిన ఆమె గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి ఇటీవలే భర్తకు తోడుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె భర్త గోపి టీడీపీ మండల ఎస్సీ సెల్‌ చైర్మన్‌గా చురుగ్గా పనిచేశారు. దీంతో అటు అంజిబాబు, ఇటు సరస్వతి పేర్లపై అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.

డిప్యూటీ మేయర్‌ రేసులో చార్పిత

ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా 27 డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన చావలి చార్పిత పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎంలో బీటెక్‌ పూర్తిచేసిన చార్పిత ప్రస్తుతం ఎంటెక్‌ చదువుతున్నారు. ఎన్నికల్లో పోటీచేసి 501 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చార్పిత అమ్మమ్మ ఆరంభం నుంచి టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం అన్నవరం దేవస్థానం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. చార్పిత తాతయ్య చావలి కృష్ణ గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. వీటన్నింటికీ మించి చార్పిత సోషల్‌ మీడియాలో టీడీపీ తరఫున చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో ఆ అమ్మాయి నిర్వహించిన ప్రచారం, ఫలితాల అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు ఽధన్యవాదాలు తెలిపిన తీరు తదితర అంశాలను టీడీపీ అధిష్ఠానం గుర్తించింది. తదనుగుణంగా చార్పితను డిప్యూటీ మేయర్‌ పదవికి అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకొన్నట్లు తెలిసింది.

Updated Date - Nov 12 , 2026 | 02:29 AM