Share News

మీరే పోటీ చేయండి!

ABN , Publish Date - Oct 15 , 2026 | 03:15 AM

కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో చైర్మన్‌ స్థానాలకు పోటీచేసే దీటైన అభ్యర్థులు దొరక్క వైసీపీ నాయకులు సతమతమవుతున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత జగన్‌ జోక్యం చేసుకొని రిజర్వేషన్లు అనుకూలించిన స్థానాల్లో ఇన్‌చార్జిలు, లేక వారి కుటుంబ సభ్యులను పోటీ చేయాలని ఒత్తిడి పెంచారు.

మీరే పోటీ చేయండి!

లేకుంటే మీ కుటుంబసభ్యులను రంగంలోకి తీసుకురండి

ఇన్‌చార్జిలకు జగన్‌ హుకుం

మునిసిపాలిటీలకు అభ్యర్థులు దొరక్క వైసీపీ సతమతం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో చైర్మన్‌ స్థానాలకు పోటీచేసే దీటైన అభ్యర్థులు దొరక్క వైసీపీ నాయకులు సతమతమవుతున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత జగన్‌ జోక్యం చేసుకొని రిజర్వేషన్లు అనుకూలించిన స్థానాల్లో ఇన్‌చార్జిలు, లేక వారి కుటుంబ సభ్యులను పోటీ చేయాలని ఒత్తిడి పెంచారు. కొందరికైతే సూటిగా పోటీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఏడు మునిసిపాలిటీలు, ఒక నగరపంచాయతీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీతోపాటు వైసీపీ దృష్టి సారించింది. అయితే దీటైన అభ్యర్థులు లభించక, కొన్నిచోట్ల అసలు పోటీకే ఎవ్వరూ ముందుకు రాక వైసీపీ సతమత మవుతోంది. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులకైతే పోటీచేసే అవకాశం కనిపించడం లేదు. దీనికితోడు చైర్మన్‌ పదవులకే అభ్యర్థులు లేకపోతే పార్టీ ప్రతిష్ట దెబ్బతిం టుందని భావించిన వైసీపీ అధిష్ఠానం పెద్దలు ఆయా స్థానాల వారీ సమాచా రాన్ని జగన్‌కు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అధినేత నేరుగా రంగంలోకి వచ్చి అభ్యర్థుల ఎంపికపై అవసరమైన పార్టీ ఇన్‌చార్జిలతో మాట్లాడటం ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిని పోటీ చేయమని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. పోటీకి సిద్ధంకాని రవి ప్రత్యామ్నాయ పేర్లు సూచించినట్లు సమాచారం. ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి కుప్పం ప్రసాద్‌ను రంగంలోకి దింపాలని భావిస్తుండగా జగన్‌ మాత్రం రవిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. మార్కాపురం నుంచి పార్టీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు కోడలిని పోటీ చేయించాలని జగన్‌ సూచించినట్లు సమాచారం. అలాగే కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ కుమారుడిని రంగంలోకి దించాలని సూచించినట్లు తెలిసింది. గిద్దలూరు నుంచి ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదించడంతో వారిలో ఒకరిని ఎంపికచేయాలని ఇన్‌చార్జి నాగార్జునరెడ్డికి తెలిపారు. కనిగిరి ఇన్‌చార్జి యాదవ్‌ కావడంతో రెడ్డి సామాజికవర్గం నుంచి అభ్యర్థిని పోటీగా దించాలని ఆదేశించారు. చీమకుర్తి, దర్శి నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే బూచేపల్లి పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అద్దంకి విషయంలో అక్కడ ఇన్‌చార్జి నాన్‌లోకల్‌ కావడంతో స్థానికంగా కమ్మ సామాజికవర్గం అభ్యర్థిని రంగంలో దించాలని లేదంటే నీ టికెట్‌కే ఇబ్బందని హెచ్చరించినట్లు తెలిసింది.

Updated Date - Oct 15 , 2026 | 03:15 AM