Share News

ఔను.. వాళ్లంతా బడిలో చేరారు!

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:56 AM

వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులంతా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. వీరికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి స్కూళ్లకు తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల్లోని దాదాపు 10వేల కుటుంబాల వారు గ్రామాలను వదిలి బయటకు వచ్చేశారు.

ఔను.. వాళ్లంతా బడిలో చేరారు!
ఆర్టీసీ బస్సులో స్కూల్‌కు వెళ్తున్న వెలిగొండ ముంపు గ్రామాల విద్యార్థులు

ముంపు గ్రామాల నుంచి మైదాన పాఠశాలలకు..

769 మందిలో 768 మంది చేరిక

వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు

మార్కాపురం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులంతా వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. వీరికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి స్కూళ్లకు తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల్లోని దాదాపు 10వేల కుటుంబాల వారు గ్రామాలను వదిలి బయటకు వచ్చేశారు. వారికోసం ఏడు చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో అధికారులు ప్లాట్లు కేటాయించారు. కొందరు వివిధ ప్రాంతాల్లో అద్దె గృహాల్లో, మరికొందరు బయట ఊళ్లలో బంధువుల వద్ద ఉంటూ వారి కాలనీల్లో నివాసాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో ముంపు గ్రామాల్లోని సుంకేసుల, కలనూతల, కె.నాగులవరం, గుండంచర్ల, అక్కచెరువు, గొట్టిపడియలోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో 769 మంది విద్యార్థులు ఇప్పటి వరకు చదువుతున్నారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వారికి వివిధ చోట్ల బడులను కేటాయించి వారికి ఇష్టమైన చోట చేరేందుకు అనుమతి ఇచ్చింది. వారంతా మార్కాపురం పట్టణంలోని పీఎస్‌ కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, మునిసిపల్‌ పాఠశాలల్లోనూ, దేవరాజుగట్టు ఉన్నత పాఠశాల, గొబ్బూరు, కె.కొత్తపల్లి, కోలభీమునిపాడు స్కూళ్లలో చేరేందుకు అవకాశం కల్పించారు. గతనెల 31న వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల తరువాత ఆయా ప్రాంతాలకు కుటుంబాలు వెళ్లిపోయాయి. ఈనెల 6 నుంచి 9వ తేదీలోపు మొత్తం 769 మంది విద్యార్థుల్లో 768 మంది పాఠశాలల్లో చేరారని జిల్లా విద్యాశాఖాధికారి సామా సుబ్బారావు తెలిపారు. ఆ ఒక్క విద్యార్థి హైదరాబాద్‌ వలస వెళ్లినట్టు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా అధికారులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నిర్వాసిత కాలనీలు, ఇతరత్రా నిర్దేశించిన ప్రాంతాలకు విద్యార్థులు చేరితే అక్కడి నుంచి బస్సుల్లో స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి తీసుకువస్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి చదువూ మధ్యలో ఆగిపోకుండా అందరికీ వసతులు కల్పించడంతో నిర్వాసితులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Updated Date - Sep 17 , 2026 | 02:56 AM