ఆగని వైసీపీ కుయుక్తులు
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:27 AM
కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికలను ఎలాగైనా ఆపాలన్న ఆలోచనతోనే వైసీపీ నాయకులు ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రిపై ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఏమైనా మెత్తబడతారేమోనన్న సందేహంతో బుధవారం మరో ముగ్గురు వైసీపీ నాయకులతో ఇంప్లీడ్ పిటిషన్లు వేయించారు.
కందుకూరులో ఎన్నికలను అడ్డుకునేందుకు యత్నాలు
దాసరి మాల్యాద్రి పిటిషన్‌లో మరో ముగ్గురు వైసీపీ నేతల ఇంప్లీడ్
ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం
అడ్డంకులు తొలగేలా అఫిడవిట్లు.. నేడు హైకోర్టులో విచారణ
కందుకూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికలను ఎలాగైనా ఆపాలన్న ఆలోచనతోనే వైసీపీ నాయకులు ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రిపై ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఏమైనా మెత్తబడతారేమోనన్న సందేహంతో బుధవారం మరో ముగ్గురు వైసీపీ నాయకులతో ఇంప్లీడ్ పిటిషన్లు వేయించారు. ఆనందపురం గ్రామానికి చెందిన తల్లపనేని గోపి, గనిగుంటకు చెందిన వడ్డివల్లి వెంకట్రావు, శామీరపాలెం గ్రామానికి చెందిన ముప్పరాజు సుభాని ఈ పిటిషన్ లను దాఖలు చేశారు. దీంతో కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికలను ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యం వైసీపీ నేతల్లో ఎంత బలంగా ఉందో తేటతెల్లమైంది. దాసరి మాల్యాద్రిపై ఒత్తిడి తగ్గించడం, ఒకవేళ ఆయన ఉపసంహరించుకున్నా కేసు యథావిధిగా కొనసాగేలా చూడాలన్న వ్యూహంలో భాగంగానే వైసీపీ కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంప్లీడ్ పిటిషన్లు వేయించినట్లు తెలుస్తోంది.
ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ప్రభుత్వం
పాలకవర్గాలు లేని మునిసిపాలిటీలలో అభివృద్ధి కుంటుపడుతోందని, ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ప్రభుత్వంలోని పెద్దలు ఉన్న విషయం విదితమే. అందులో భాగంగా ఆరునెలల క్రితమే కోర్టు కేసులు ఉన్న అన్ని మునిసిపాలిటీలలో సంబంధిత నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అందుకనుగుణంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీ మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రితో పలుదఫాలు టీడీపీ నేతలు పిటిషన్ ఉపసంహరణ కోసం సంప్రదింపులు జరపగా ఆయన వైఖరిలో మార్పువచ్చినా ఫలితం లేకపోయింది. వైసీపీ నేతలు దాసరి మాల్యాద్రిపై ఒత్తిడి పెంచి పిటిషన్ ఉపసంహరించుకోవద్దని చెప్పడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనపై కాల్‌మనీ, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదవడంతో రాజకీయం వేడెక్కింది. దీంతో దాసరి మాల్యాద్రి అజ్ఞాతంలోకి వెళ్లిపోగా ఆయన పిటిషన్‌లో మరో ముగ్గురు వైసీపీ నేతలు ఇంప్లీడ్ అయ్యారు. దీంతో అధికార టీడీపీ నాయకులు వ్యూహం మార్చి కోర్టులో అఫిడవిట్ దాఖలు ద్వారా ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసేందుకు రంగంలోకి దిగారు.
అఫిడవిట్లు దాఖలు.. నేడు వాదనలు
రాష్ట్రవ్యాప్తంగా 22 మునిసిపాలిటీలలో వైసీసీ నేతల కేసులే ఎన్నికలకు అడ్డంకిగా ఉన్నాయి. కొన్ని మునిసిపాలిటీలలో గ్రామాల విలీనం జరగాలని, మరికొన్ని చోట్ల గ్రామాల విలీనం అన్యాయమని వైసీపీ పిటిషన్లు వేసి ఉంది. దీంతో ఏ మునిసిపాలిటీకి ఆ మునిసిపాలిటీలో వైసీపీ పిటిషన్‌కు అనుగుణంగా అఫిడవిట్ల దాఖలుకు నిర్ణయించిన ప్రభుత్వం తదనుగుణంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ పిటిషన్ గ్రామాలను విలీనం చేయాలని ఉంటే అందుకు సిద్ధంగా ఉన్నట్లు, గ్రామాలను విలీనం చేయడం అన్యాయం అని ఉంటే ఆ గ్రామాలను తొలగించి అయినా మేము ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అఫిడవిట్లు దాఖలు చేయిస్తున్నారు. కందుకూరు మునిసిపాలిటీలో కూడా గతంలో కోర్టు తీర్పునకు అనుగుణంగానే గ్రామాల విలీనం జరిగిందని, కాదంటే గ్రామాలను తీసివేసి అయినా ఎన్నికలకు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నందున తక్షణం తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం నుంచి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మునిసిపల్ అధికారులు ఇదేపనిలో విజయవాడలో ఉన్నట్లు సమాచారం. మునిసిపాలిటీల పిటిషన్లపై గురువారం హైకోర్టులో వాదనలు ఉన్నందున బుధవారమే అఫిడవిట్లు దాఖలు చేసినట్లు సమాచారం. త్వరలోనే కోర్టు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని, ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వచ్చినా మలి విడతలోనైనా కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికలు జరగడం ఖాయమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికలు నిర్వహించి తీరుతామని, కందుకూరు పట్టణ అభివృద్ధికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.