Share News

వైసీపీ విషప్రచారం

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:34 PM

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేస్తుండగా తమను ప్రజలు ఎక్కడ మరిచిపోతారోనని వైసీపీ విషప్రచారం చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

వైసీపీ విషప్రచారం
విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

గత ఐదేళ్లు రోడ్లపై తట్ట మట్టిపోయకుండా ప్రజలను మోసం చేసింది..

మంత్రి గొట్టిపాటి రవి ధ్వజం

కొప్పెరపాలెం, మల్లాయపాలెం గ్రామాలలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

బల్లికురవ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేస్తుండగా తమను ప్రజలు ఎక్కడ మరిచిపోతారోనని వైసీపీ విషప్రచారం చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని కొప్పెరపాలెం, మల్లాయపాలేల్లో 156 మంది విద్యార్థులకు మంత్రి సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు ధీటుగా పనిచేయాలనే ఉద్దేశంతో 16 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా మెగా డీఎస్సీని నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని వైసీపీ ప్రభుత్వం డీఎస్పీపై లేనిపోని ఆరోపణలుచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోందన్నారు. వైసీపీ తీరు మారకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. తల్లికి వందనం పేరిట ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ప్రజాప్రభుత్వం సాయం అందించిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలోనే అద్దంకి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. విద్యుత్‌ చార్జిలను ట్రూడౌన్‌ చేశామన్నారు. రాబోయే రోజుల్లో కూడా చార్జిలను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 120 గ్రామాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రత్యేక విద్యుత్‌ లైన్లను ఏర్పాటుచేయటమే కాక ఏడు విద్యుత్‌ సబ్‌స్టేషన్లను మంజురు చేశామన్నారు. గత ఏడాది విద్యార్థులకు 11 వేలకుపైగా సైకిళ్లను దాతల సహకారంతో అందించినట్టు చెప్పారు. ఈఏడాది కూడా 6వ తరగతిలో చేరిన విద్యార్థులకు సైకిళ్లను అందిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవినాయక్‌, ఎంపీడీవో కుసుమకుమారి, విద్యుత్‌ శాఖ ఈఈ మస్తాన్‌రావు, టీడీపీ నేతలు మలినేని గోవిందరావు, కోట శ్రీనివాసరావు, యర్రా ఈశ్వరరావు, జూపల్లి గంగాధర్‌, లేమాటి హనుమంతురావు, జూపల్లి రాఘవరావు, కృష్ణ, నాగయ్య, సారెద్దు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:34 PM