Share News

వైసీపీ నీచ రాజకీయాలకు భయపడేది లేదు

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:01 PM

వైసీపీ చేస్తున్న నీచమైన రాజకీయాలకు భయపడేదిలేదని రాష్ట్ర మాలకార్పోరేషన్‌ చైర్మన్‌, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్‌కుమార్‌, జనసేన పార్టీ సమన్వకర్త కందుకూరి బాబు స్పష్టం చేశారు.

వైసీపీ నీచ రాజకీయాలకు భయపడేది లేదు
మాట్లాడుతున్న చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సమన్వకర్త కందుకూరి బాబు

మాల కార్పోరేషన్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌

సంతనూతలపాడు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేస్తున్న నీచమైన రాజకీయాలకు భయపడేదిలేదని రాష్ట్ర మాలకార్పోరేషన్‌ చైర్మన్‌, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్‌కుమార్‌, జనసేన పార్టీ సమన్వకర్త కందుకూరి బాబు స్పష్టం చేశారు. గురువారం పేర్నమిట్టలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామంలో ఇటీవల జనసేన, వైసీపీ నాయకుల మధ్య స్వల్పవివాదం జరిగిందని, అయితే దానిని వైసీపీ నాయకులు నీచమైన రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ వివాదంలో వైసీపీ నాయకుడికి ఎటువంటి గాయాల కాకపోయిన, తన ఇంటి వద్ద జారిపడటంతో కలిగిన గాయాలను రాజకీయంగా వాడుకునేందుకు చికిత్స పేరుతో ఒంగోలు రిమ్స్‌లో చేరి నానా హంగామా చేశారని వారు ఆరోపించారు. దీనిపై జనసేన రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ నేతలు నానా రకాలుగా బురదజల్లడం వారి చిల్లర రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున గాయపడిన వైసీపీ నాయకుడిని పరామర్శించి పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత చైర్మన్‌ విజయ్‌కుమార్‌, కందుకూరిబాబులను ఘనంగా నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో కొణిజేటి ధనుష్‌, కె.శ్రీను, కె.వాసు, బాలసుబ్రమణ్యం, రాము, చరణ్‌, షరీఫ్‌, నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 11:02 PM