వైసీపీ వేధింపులు
ABN , Publish Date - Jul 12 , 2026 | 02:14 AM
పార్టీలో తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీసీ నేత ప్రసన్న ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తంగా వైసీపీ కార్యాలయంలో జరిగిన గొడవ చినికిచినికి గాలివానలా మారింది.
మహిళా నేత ఆత్మహత్యాయత్నం
ఏడాది నుంచి ఇబ్బందిపెడుతున్నారంటూ వీడియో
పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జిపై ఆరోపణలు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 11(ఆంధ్ర జ్యోతి) : పార్టీలో తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ వైసీసీ నేత ప్రసన్న ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తంగా వైసీపీ కార్యాలయంలో జరిగిన గొడవ చినికిచినికి గాలివానలా మారింది. వైసీపీ ఎస్టీ మహిళా విభాగం ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఇటీవల జరిగిన పరిణామాలతోపాటు పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి తనను తొలగిస్తున్నా రంటూ సెల్ఫీ వీడియో తీసి తర్వాత నిద్రమాత్రలు మింగారు. ఆమెను వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలు లోని రిమ్స్‌కు తరలించారు. వైఎస్సార్ జయంతి సంద ర్భంగా ఈనెల 8న ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ప్రసన్న కాలును వైసీపీ మహిళా నాయకురాలు మేరీకుమారి తొక్కారు. ఈ విషయమై ప్రశ్నించిన ప్రసన్నపై మేరీకుమారితోపాటు ఆమె భర్త శివకుమార్ దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉన్న నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకోగా, ఇరువురు మహిళలూ కొట్టుకున్నారు. మరోవైపు తన తల్లిపై దాడిచేసిని శివకుమార్‌పై ప్రసన్న కుమారుడు మదన్‌కుమార్ స్నేహితులతో కలిసి నగరంలోని ఓ హోటల్‌లో ప్రతిదాడి చేశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. దీంతో వ్యవహారం రచ్చకెక్కింది. అయితే ప్రసన్నను వైసీపీ గ్రూపుల్లో నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తొలగించారు. బాధితురాలినైన తనని పార్టీ గ్రూపుల్లోంచి తొలగించడంపై పేరం ప్రసన్న మనస్తాపానికి గురయ్యారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేస్తూ నిద్రమాత్రలు మింగారు. సెల్ఫీ వీడియోలో ఆమె.. వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు శంకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది నుంచి తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నానని తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను ప్రోత్సహిస్తూ తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. అఽధినేత జగన్మోహన్‌రెడ్డి పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తుంటే ఇక్కడ మాత్రం నాయకుల అడుగులకు మడుగులొత్తేవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తనలాంటి గిరిజన కులానికి చెందిన మహిళను అనేక ఇబ్బందులు పెట్టారని కన్నీరు పెట్టుకున్నారు. వాటన్నింటినీ తాను ఎంతో ఓపికతో సహిస్తూ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చానన్నారు. తనపై దాడి చేయడంతో తన కుమారుడు, అతని స్నేహితులు శివకుమార్‌ను ప్రశ్నించారన్నారు. కానీ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో ఒకరోజు రాత్రంతా తాలూకా పోలీస్‌స్టేషన్ వద్ద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను పెద్దవారికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. తాను ఈ విషయాలన్నింటిని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి తీసుకెళ్తానని ప్రసన్న ఆ సెల్పీ వీడియోలో ప్రకటించారు.
బాధితురాలికి అండగా ఉంటాం
మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
పార్టీలు ఏవైనా మహిళలపై దాడులు అమానుషమని, బాధితురాలికి మహిళ కమిషన్ అండగా ఉండి, అవసరమైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు తనను పార్టీలోని నాయకులే వేధిస్తున్నారంటూ వైసీపీ ఎస్టీసెల్ నగర అధ్యక్షురాలు పేరం ప్రసన్న శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించారు. ఈ మేరకు ఆమె ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతుండగా, విషయం తెలుసుకున్న రాయపాటి శైలజ శనివారం ఆసుపత్రిలో ప్రసన్నను పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన వివరాలను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలపై దాడులు సరైంది కాదన్నారు. బాధితురాలిని గత ఏడాది కాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, తన వ్యక్తిక్తంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాజకీయపార్టీలలో మహిళల ప్రాత పెరిగిందన్నారు. పార్టీలు బలంగా ఉండాలంటే మహిళలు బలం కూడా తోడు కావాలన్నారు. ఇటీవల కాలంలో ఆడవారిపై విమర్శలు, దూషణలు, వివిధ రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి మహిళ మానసికంగా బలంగా ఉండదన్నారు. సున్నితమైన వారు ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే బాధిత మహిళ కోరితే ఆమెకు తాము అండగా ఉంటామని తెలిపారు. అవసరమైతే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకుని ప్రసన్నకు మహిళ కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు.