వరల్డ్ రికార్డు సేకరణ
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:15 AM
ఒంగోలు మునిసిపాలిటీ 150 వసంతాల వేడుకలలో భాగంగా వరల్డ్ రికార్డు సాధనే లక్ష్యంగా చేపట్టిన మెగా సెగ్రిగేషన్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. శనివారం నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతోపాటు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ విజయవంతం
మునిసిపాలిటీ 150 వసంతాలలో భాగంగా నిర్వహణ
పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు
81వేల గృహాల నుంచి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపాలిటీ 150 వసంతాల వేడుకలలో భాగంగా వరల్డ్ రికార్డు సాధనే లక్ష్యంగా చేపట్టిన మెగా సెగ్రిగేషన్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. శనివారం నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతోపాటు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సంద ర్భంగా కార్పొరేషన్ స్పెషలాఫీసర్ అయిన కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ మన ఒంగోలు-మన గౌరవం నినాదంతో ఈనెల 28, 29, 30 తేదీలలో మునిసిపాలిటీ 150 ఏళ్ల వేడుకలను అత్యంత వైభవంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని తెలిపారు. వేడుకలలో భాగంగా పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలోని 81వేల గృహాల నుంచి ఒక గంట సమయంలోనే తడి, పొడి చెత్తను సేకరించామన్నారు. ఈ డ్రైవ్‌లో ఐదుగురు జిల్లా అధికారులు పర్యవేక్షకులుగా.. వారికి సహాయకులుగా మునిసిపల్ డీఈ, ఏఈ, సచివాలయ సెక్రటరీలు, బీఎల్‌వోలు, మెప్మా సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులు సుమారుగా 2,500పైగా పాల్గొన్నారని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం, వరల్డ్ రికార్డు సాధించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.
మంచి స్పందన వచ్చింది: ఎంపీ
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పాటై150 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగాఆ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించడానికి కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తాం: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు మునిసిపాలిటీ 150 వసంతాల వేడుకలను గత ఆరు నెలలుగా వివిధ కార్యక్రమాల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులోభాగంగా గతంలో ఎన్నడూ, ఎక్కడ లేని విధంగా ఒకే రోజు150 ప్రాంతాల్లో మెగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అలాగే ఒకే రోజు మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ నిర్వహించి 81వేల నివాసాల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించామని చెప్పారు. వాటి ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వరల్డ్ రికార్డు సాధనతోపాటు, చరిత్రలో నిలిచిపోయేలా మూడు రోజులపాటు ఒంగోలులో వేడుకలను నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 27న సుమారు మూడువేల మందితో నగరంలో ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు. 30న భారీగా ఒంగోలు గిత్తల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు దామచర్ల స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర కమిషనర్ టి.వెంకటకృష్ణయ్య, ఎంహెచ్‌వో డాక్టర్ వైష్ణవితోపాటు జడ్పీ సీఈవో చిరంజీవి, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జిల్లాపశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.రవి, ఎంఈ ఏసయ్య, శానిటరీ సూపర్‌వైజర్లు షేక్ బాబ్జి, పిచ్చయ్య పాల్గొన్నారు.