Share News

యువత భవిత కోసం అంకితభావంతో కృషి

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:12 PM

రాష్ట్రంలో యువత బంగారు భవిత కోసం ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డాలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు.

యువత భవిత కోసం అంకితభావంతో కృషి
విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్న మంత్రి

మంత్రి డాక్టర్‌ స్వామి వెల్లడి

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో యువత బంగారు భవిత కోసం ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డాలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. సోమవారం ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, శ్రీహర్షిణీ కాలేజీలో ఏర్పాటుచేసిన యువత-భవిత కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూరాష్ట్రంలోని యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, తెచ్చి యువత కోసం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీపీఎస్సీ, పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. కౌశలం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జగన్‌ అండ్‌ కో కంపెనీ గ్రూప్‌-1 ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడి రూ.150 కోట్లు కొల్లగొట్టారని, ప్రజాప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా పారదర్శకంగా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. అది ఓర్వలేని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించామన్నారు. ఎక్కడైనా అవకతకవలు జరిగినట్లు నిరూపించాలని ఉద్యోగాలు పొందిన టీచర్లు సవాల్‌ విసిరితే వైసీపీ తోకముడిచి సిగ్గు లేకుండా ఇంకా తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.ఎమ్మెల్యేలు, దామచర్ల జనార్దన్‌, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు మాట్లాడుతూచదువు పూర్తయ్యే నాటికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభు త్వ లక్ష్యమన్నారు.విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్‌, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమనే విషయాన్ని యువత గుర్తించాలని చెప్పారు.

బధిరుల పాఠశాల సందర్శన

నగరంలోని భాగ్యనగర్‌లో గల ప్రభుత్వ బధిరుల పాఠశాలను మంత్రి స్వామి సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి పాఠశాల పరిసరాలు, ఆట స్థ్థలం ఇతర వసతులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థుల, విద్య, సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.విద్యార్థుల కు అవసరమైన అన్నీ మౌలిక సౌకర్యాలు కల్పించామని విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు.

Updated Date - Sep 21 , 2026 | 11:12 PM