కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:59 PM
ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం అద్దంకి, దర్శి నియోజకవర్గాలను కలిపి అద్దంకి కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఏర్పాటు చేశారు. అయితే మిగిలిన శాఖలకు సంబంధించి కూడా డివిజన్ స్థాయిలో పలు కార్యాలయాల ఏర్పాటు జరగాల్సి ఉండటంతో కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా అభివృద్ధి పనుల పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో డీఎల్‌డీవో కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.
అద్దంకి,జనవరి7(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం అద్దంకి, దర్శి నియోజకవర్గాలను కలిపి అద్దంకి కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఏర్పాటు చేశారు. అయితే మిగిలిన శాఖలకు సంబంధించి కూడా డివిజన్ స్థాయిలో పలు కార్యాలయాల ఏర్పాటు జరగాల్సి ఉండటంతో కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా అభివృద్ధి పనుల పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో డీఎల్‌డీవో కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు డీఎల్‌డీవో సువార్తమ్మను అద్దంకి ఇన్‌చార్జి డీఎల్‌డీవోగా నియమించారు. ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తుండగా, ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి పనులు పర్యవేక్షణకు, పింఛన్‌ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఏపీడీలను నియమించటంతో పాటు కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్‌ఎ్‌సపీ ఈఈ కార్యాలయం ఇప్పటికే ఉండగా, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్ డీఈ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యాశాఖకు సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను కూడా నియమించాల్సి ఉంది. అద్దంకి నియోజకవర్గం చీరాల డివిజన్‌లో, దర్శి నియోజకవర్గం ఒంగోలు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరిధిలో ఉండగా కొత్తగా అద్దంకి లో ఏర్పాటు చేయాల్సి ఉంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎ్‌సపీ కార్యాలయం దర్శిలో ఉండగా అద్దంకిలో అదనంగా ఏర్పాటు చేస్తారా, లేదా తాత్కాలికంగా దర్శి డీఎ్‌సపీ కార్యాలయం పరిధిలోకి చేరుస్తారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి,కొరిశపాడు, పంగులూరు మండలాలు చీరాల డీఎ్‌సపీ పరిధిలో, సంతమాగులూరు, బల్లికురవ మండలాలు బాపట్ల డీఎ్‌సపీ పరిధిలో ఉన్నాయి. దర్శి డీఎ్‌సపీ పరిధిలో చేరిస్తే సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు మరింత దూరం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. రవాణా శాఖ కు సంబంధించి అద్దంకి నియోజకవర్గం ఇప్పటి వరకు చీరాల ఎంవీఐ పరిధిలో ఉండి. సబ్ సెంటర్‌గా వారంలో మూడు రోజుల పాటు అద్దంకి లో సేవలు అందించే విధంగా నడుస్తోంది. అయితే దర్శిలో ఎంవీఐ కార్యాలయం ఉండటంతో రెండు కలిపి ఒకే ఎంవీఐ కార్యాలయం పరిధిలోకి చేరుస్తారా లేక కొత్తగా అద్దంకిలో ఎంవీఐ కార్యాలయం ఏర్పాటు చేస్తారా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఆయా శాఖల డివిజన్ స్థాయి కార్యాలయాల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రి రవికుమార్ ఉన్నతస్థాయి అఽధికారులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కార్యాలయాలను తాత్కాలికంగా శింగరకొండ వద్ద ఉన్న మినీ స్టేడియంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని శాఖలకు సంబంఽధించి డివిజన్ స్థాయి తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసిన తరువాత ఆయా శాఖలకు ఎంతమేర స్థలాలు కేటాయించాల్సి వస్తుందో పరిశీలించి అద్దంకి పట్టణం కు సమీపంలో రేణింగవరం రోడ్డులో గతంలో దేవదాయశాఖ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన 14 ఎకరాల భూమి ఖాళీగా ఉండటంతో అక్కడ అన్ని కార్యాలయాల భవనాలు నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో మంత్రి రవికుమార్ ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే రెవెన్యూ అధికారులతో కూడా చర్చించారు.