Share News

మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 07 , 2026 | 02:43 AM

మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాలికలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యం
నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలను హోంమంత్రి అనితకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

మార్కాపురం జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయం

సమీక్షా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత

కనిగిరి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాలికలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కనిగిరిలో మార్కాపురం జిల్లా పోలీసు అధికారులతో ఆమె శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వారి పనితీరును అభినందించారు. జిల్లాలో మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్‌ నేరాల నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తున్నారంటూ ఎస్పీ హర్షవర్ధన్‌రాజును ప్రశంసించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు, డ్రోన్‌లు, ఫింగర్‌ ప్రింట్‌ పరికరాల వినియోగాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గంజాయి అక్రమ రవాణా కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ.. పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లావ్యాప్తంగా కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళల భద్రత కోసం శక్తి టీమ్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు డ్వాక్రా సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని చెప్పారు. ఈ సమావేశంలో డీస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 02:43 AM