Share News

మహిళా ఓటర్లే అధికం!

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:22 AM

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఒంగోలు నగర ఓటర్ల జాబితా ఖరారైంది. ఇప్పటి వరకు నగరంలో 50 డివిజన్లు ఉండగా వాటి సంఖ్యను 62కు పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహిళా ఓటర్లే అధికం!

ఒంగోలులో తుది జాబితా ఖరారు

50 నుంచి 62కి పెరిగిన డివిజన్లు

ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 17,449

5వ డివిజన్‌లో అధికం..

58వ డివిజన్‌లో అతి తక్కువ ఓట్లు

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఒంగోలు నగర ఓటర్ల జాబితా ఖరారైంది. ఇప్పటి వరకు నగరంలో 50 డివిజన్లు ఉండగా వాటి సంఖ్యను 62కు పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు, ఆయా డివిజన్ల వారీగా స్త్రీ, పురుష ఓటర్లను అధికారులు ప్రకటించారు. ఆ ప్రకారం మొత్తం 62 డివిజన్‌లలో 1,92,873 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 92,228మంది పురుష ఓటర్లు ఉండగా, 1,00,591 మంది మహిళా ఓటర్లు, 54 ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రకారం పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో వనితల ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 1,75,424మంది ఓటర్లు ఉండగా ఈ సారి ఆ సంఖ్య 1,92,873కు చేరింది. గత ఐదేళ్లలో 17,449 మంది ఓటర్లు పెరగ్గా, అందులోనూ మహిళలే అధికంగా ఉన్నారు.

ఓటర్లు పెరిగారు

ఒంగోలు మునిసిపాలిటీగా ఉన్నప్పుడు 1,01,000 ఓటర్లు ఉండగా, కార్పొరేషన్‌ అయిన తర్వాత విలీన గ్రామాల ఓటర్లు కూడా చేరడంతో ఆ సంఖ్య 1,75,424 మందికి చేరింది. అందులో కులాల వారీగా పరిశీలిస్తే.. ఎస్టీలు 2,682 మంది, ఎస్సీలు 22,642, బీసీలు 41,308 మంది, ఇతరులు 1,08,388 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,75,424 మందిలో పురుషులు 88,065 ఓటర్లు ఉండగా, స్త్రీలు 87,357 మంది ఉన్నారు. ఆ ప్రకారం 2021లో తొలిసారిగా కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్‌లకుఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం రెండోసారి కార్పొరేషన్‌ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. 62 డివిజన్ల పునర్విభజనతో ఓటర్ల సంఖ్య 1,92,873కు చేరింది.

5లో అధికం.. 58లో అతి తక్కువ ఓటర్లు

డివిజన్ల వారీగా ఓటరు జాబితాను ప్రకటించగా అందులో 5వ డివిజన్‌ పరిధిలోని పాత మార్కెట్‌ సెంటర్‌లోని అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ విగ్రహం నుంచి పడమర వైపు అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోని మాగుంట సుబ్బిరామిరెడ్డి విగ్రహం వరకు గల ప్రాంతాలను నిర్ధారించారు. అందులో అత్యధికంగా 5,383మంది ఓటర్లు ఉన్నారు. 58వ డివిజన్‌ పరిధిలోని కర్నూలు రోడ్డు ఉత్తరం వైపు నుంచి ఎన్జీవో కాలనీ వరకు ఉన్న ప్రాంతాలలో1,644 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన డివిజన్లలో2వేల నుంచి 4,500 వరకు ఆయా డివిజన్ల జనాభా ప్రాతిపదికన ఓటర్ల జాబితాను ప్రకటించారు.

Updated Date - Sep 24 , 2026 | 03:22 AM