మహిళలూ మీకోసం
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:33 AM
మార్కాపురం జిల్లాలోని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుక ఇది. ప్రభుత్వం వనితల భద్రత, వారికి న్యాయ సహాయం కోసం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే సఖి వన్‌స్టాప్ సెంటర్‌ను ఆది వారం మార్కాపురంలో ప్రారంభిస్తోంది. అ
మార్కాపురంలో సఖి వన్‌స్టాప్ సెంటర్
మహిళా దినోత్సవం సందర్భంగా నేడు వర్చువల్‌గా ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు
మార్కాపురం, మార్చి 7 (ఆంఽధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాలోని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుక ఇది. ప్రభుత్వం వనితల భద్రత, వారికి న్యాయ సహాయం కోసం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే సఖి వన్‌స్టాప్ సెంటర్‌ను ఆది వారం మార్కాపురంలో ప్రారంభిస్తోంది. అమరావతిలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రం కోసం ప్రస్తుతం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో ఒక గదిని కేటాయించారు. హింసకు గురైన మహిళలకు, బాలికలకు అవసరమైన వైద్య, పోలీసు, న్యాయ సహాయాన్ని ఇక్కడ అందిస్తారు. కౌన్సెలింగ్ ఇవ్వడం, తాత్కాలిక వసతి వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది.
గతంలోనే ప్రతిపాదన
కుటుంబంలో, పని ప్రదేశంలో, సమాజంలో హింసకు గురైన మహిళలు, బాలికలకు సహాయం కోసం జిల్లాకు ఒక సఖీ వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గతంలోమార్కాపురం ప్రాంతం నుంచి ఒంగోలుకు వెళ్లేందుకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ ప్రత్యేక కేంద్రం కావాలని ప్రతిపాదన పంపారు. ఈలోపు మార్కాపురం జిల్లా ఏర్పాటవడంతో ఇక్కడ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గృహహింస, లైంగికదాడి, వేధింపులు, యాసిడ్ దాడి, మానవ అక్రమ రవాణా బాధితులకు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది.
ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్
ఎవరైనా వెంటనే తమ సమస్యను తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1096ను సంప్రదించాల్సి ఉంటుంది. అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్లు 100, 112కి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బాధితులకు వెంటనే సంబంధిత అధికారులు సఖీ కేంద్రం ద్వారా అవసరమైన సహాయాన్ని అందిస్తారు.
కాంట్రాక్ట్ పద్ధతిపై సిబ్బంది నియామకం
సఖీ కేంద్రంలో పని చేసేందుకు అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తారు. ఇప్పటికే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ కేంద్రంలో అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్లు ఇద్దరు, పారా లీగల్ లాయర్, పారా లీగల్ మెడికల్, సైకో సోషల్ కౌన్సెలర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్పర్‌లు ముగ్గురు, సెక్యూరిటీ గార్డులు ముగ్గురు అందరూ మహిళలను ఎంపిక చేసి నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.