Share News

అత్యవసరానికి ఆటంకం లేకుండా ..

ABN , Publish Date - Aug 22 , 2026 | 03:13 AM

పేదల పెద్దాసుపత్రి అయిన జీజీహెచ్‌కు రోగుల తాకిడి పెరిగింది. ప్రతిరోజూ సాధారణంతోపాటు, అత్యవసర సేవలకు వచ్చేవారితో వైద్యశాల కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.

అత్యవసరానికి ఆటంకం లేకుండా ..
క్యాజువాలిటీలో వైద్యులకు సూచనలిస్తున్న సూపరింటెండెంట్‌ మాణిక్యరావు

పదిరోజులుగా సమ్మెలో జూనియర్‌ డాక్టర్లు

జీజీహెచ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఓపీలు

వైద్య సేవలపై కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యేక దృష్టి

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వైద్యశాల అధికారులు

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పేదల పెద్దాసుపత్రి అయిన జీజీహెచ్‌కు రోగుల తాకిడి పెరిగింది. ప్రతిరోజూ సాధారణంతోపాటు, అత్యవసర సేవలకు వచ్చేవారితో వైద్యశాల కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో ఆసుపత్రిలో వైద్యుల కొరతను అధిగమించేందుకు జీజీహెచ్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమయ్యారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు ఆదేశించడంతో గురువారం డీఆర్వో వెంకటరమణ జీజీహెచ్‌కు వచ్చి అవసరమైన సూచనలు చేశారు. ఇప్పటికే జీజీహెచ్‌లో 250 మంది వైద్యులు సేవలందిస్తుం డగా, నర్సులు మరో వెయ్యి మంది వరకు ఉన్నారు. ఆయా విభాగాలకు సంబంధించి హెచ్‌వోడీలూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రస్తుతం 200 మంది వరకు జూనియర్‌ డాక్టర్‌లు విధులు బహిష్కరించడంతో ఎదురవుతున్న సమస్యను అధిగమించడంపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.మాణిక్యరావు ప్రత్యేక దృష్టి సారించారు. సమ్మె ప్రభావం రోగులపై పడకుండా ఉండేందుకు ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి ఇప్పటికే సెలవులను రద్దు చేశారు. వారితోపాటు ఫార్మ్‌డీ, ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులు, బీ-ఫార్మసీల వైద్య సేవలను వినియోగించు కుంటున్నారు. ఓపీ నుంచి శస్త్రచికిత్సల వరకు రోగులకు అసౌకర్యం కలగకుండా గతంలో వలే సేవలు అందిస్తుండటంతో జీజీహెచ్‌కు ఓపీలు పెరిగాయి.

24 గంటలూ అత్యవసర సేవలందించేలా..

సీనియర్‌ రెసిడెంట్లు, హౌస్‌ సర్జన్ల స్టయిఫండ్‌ పెంచడంతోపాటు పలు డిమాండ్‌లు పరిష్కరించాలని జూనియర్‌ డాక్టర్లు ఈనెల 11వ తేదీ నుంచి సమ్మెకు దిగారు. మొదటి దశలోసాధారణ సేవలను బంద్‌ చేసి వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. రెండో దశలో అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. దీంతో ఆసుపత్రిలో వైద్యసేవలకు కొంతమేర ఇబ్బందులు ఏర్పడటంతో అటు జిల్లా అధికారులు, ఇటు జీజీహెచ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాలలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో పనిచేస్తున్న 18 మంది డాక్టర్లను, డీసీహెచ్‌ నుంచి 15మంది, మెడికల్‌ కాలేజీ నుంచి 16మంది వైద్యులనుజీజీహెచ్‌లో వినియోగించుకుంటూ రోగుల సేవలందిస్తున్నారు. అలాగే ఐసీయూ, సూపర్‌ స్పెషాలిటీ, ఇతర కీలక విభాగాల్లో వైద్య సేవలు 24 గంటలు అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 03:13 AM