ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా..
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:50 AM
జిల్లావ్యాప్తంగా ప్రజల అర్జీల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమానికి సోమవారం నుంచి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఒంగోలులో నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం)కు జిల్లా నలు మూలల నుంచి అర్జీదారులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
పల్లె వీక్షణ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం
ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నిర్వహణ
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ప్రజల అర్జీల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమానికి సోమవారం నుంచి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఒంగోలులో నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం)కు జిల్లా నలు మూలల నుంచి అర్జీదారులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈనేపథ్యంలో ఎక్కడికక్కడ అర్జీలను పరిష్కరించేందుకు కలెక్టర్ రాజాబాబు పల్లె వీక్షణ నిర్వహణకు ఆదేశించారు. ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ మండల ప్రత్యేకాధికారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. సోమవారం జిల్లాలోని 28 మండలాల్లోని 28 గ్రామాల్లో ‘పల్లె వీక్షణ’ నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో జిల్లా, మండల స్థాయి అధికారులందరూ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. అలా కానిపక్షంలో ఎందుకు చేయలేకపోయారో కూడా వెంటనే అర్జీదారులకు తెలియజేశారు. ఆవిధంగా ప్రతి సోమవారం జరిగే మీకోసం తరహాలో పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సోమవారం ఉలవపాడు మండలం కె.రాజుపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి పాల్గొన్నారు. పల్లె వీక్షణలో వచ్చిన అర్జీలు, వాటిలో పరిష్కరించిన వాటి సమాచారాన్ని కలెక్టర్‌కు పంపే విధంగా చర్యలు తీసుకున్నారు.