ధరలు లేక.. దిక్కుతోచక..
ABN , Publish Date - Jun 23 , 2026 | 01:07 AM
ఈ ఏడాది మామిడి రైతులకు కలిసి రాలేదు. ఉలవపాడు స్పెషల్ రకం కాయలకు ధరలు లేక అందరూ దిగాలు పడ్డారు. కొందరు వచ్చిన కాడికి అమ్ముకొని నష్టాలపాలయ్యారు.
కోతలు కోయకుండానే చెట్లకే బెంగళూరు రకం మామిడి
కాయలను వదిలేస్తున్న వైనం
నష్టపోతున్న కౌలు రైతులు
ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు దక్కని ప్రభుత్వ సబ్సిడీ ఊరట
ఈ ఏడాది మామిడి రైతులకు కలిసి రాలేదు. ఉలవపాడు స్పెషల్ రకం కాయలకు ధరలు లేక అందరూ దిగాలు పడ్డారు. కొందరు వచ్చిన కాడికి అమ్ముకొని నష్టాలపాలయ్యారు. మరికొందరు ఏం చేయాలో దిక్కుతోచక, కౌలు కట్టలేక చెట్లను వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా ధరలు లేక బెంగళూరు (అంటు) రకం మామిడి రైతులు కూడా లబోదిబోమంటున్నారు. కోత కూలి, రవాణా ఖర్చులు దండగని కోయకుండానే కాయలను చెట్లకే వదిలేస్తున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉలవపాడు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఉలవపాడుతోపాటు చుట్టుపక్కల మండలా ల్లో బంగినపల్లి తరువాత బెంగళూరు రకం మామిడి కాయల వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. మామిడి సీజన్ చివరి దశలో వేల టన్నుల కాయలను రాయలసీమ జిల్లా లోని మామిడి పల్ప్ పరిశ్రమలకు ఎగుమతి చేస్తుంటారు. రెండేళ్ల నుంచి పల్ప్ ఫ్యాక్టరీల యాజమాన్యం గిట్టుబాటు ధర ఇవ్వకపోవ డంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రాసెసెంగ్ యూని ట్లు, జ్యూస్ ఫ్యాక్టరీల నిర్వాహకులు కిలో మామిడి కాయలను రూ.4కు మించి కొను గోలు చేయడం లేదు. దీంతో కౌలు రైతులు నిరాశ చెందుతున్నారు. టన్ను మామిడి ధర రూ.4 వేలు కాగా కోత కూలి, రవాణా ఖర్చు కలుపుకుంటే అంతకు అంత సరిపోతుందని, శ్రమ తప్ప ఫలితం లేదని కొందరు రైతులు చెట్లకే కాయలను వదిలేస్తున్నారు.
బయట కొనుగోలు తక్కువే
బంగినపల్లి కాయల మాదిరిగా బెంగళూరు మామిడి బహిరంగ మార్కెట్‌లో చెలామణి కాలేదు. ఈ రకం ఒక్క పల్ప్ పరిశ్రమ వ్యాపా రానికే పనికొస్తుంది. రెండేళ్ల క్రితం బెంగళూరు రకం మామిడి కాయల ధర కిలో ధర రూ.12 నుంచి రూ.16 వరకూ పలికింది. ఓ దశలో కిలో రూ.27కు చేరింది. బంగినపల్లి మామిడిలో నష్టం వస్తే చివరిలో బెంగళూరు మామిడి అమ్మకాలతో రైతులకు కొంత ఊరట లభించేది. అలాంటిది రెండేళ్ల నుంచి ప్రాసెసింగ్ యూనిట్, పల్ప్ పరిశ్రమల యాజమాన్యం కిలో ధర రూ.4 నుంచి పెంచకపోవడంతో రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. గిట్టుబాటు కాని ధరకు కోతలు జరిపేకంటే చెట్లకే కాయలను వదిలేయడం మంచిదన్న స్థితికి రైతులు మానసికంగా సిద్ధ పడ్దారు.
ప్రకాశం, నెల్లూరు మామిడి రైతులపై ప్రభుత్వం సీతకన్ను
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బెంగళూరు రకం మామిడి వేల ఎకరాల్లో సాగులో ఉంది. రాయలసీమ జిల్లాలోని తోతాపూరి మామిడితో పోటీగా ఈ రెండు జిల్లాల నుంచి వేల టన్నుల బెంగళూరు రకం కాయలు జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి అవుతాయి. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల తోతాపూరి మామాడి రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై సబ్సిడీ ప్రకటించి ఊరట కల్పించిన విషయం విదితమే. అనుకున్నదే తడవుగా ప్రభుత్వం తోతాపూరి మామిడికి కిలోకు రూ.4 సబ్సిడీ కల్పిస్తూ రూ.260 కోట్లు అప్పటికప్పుడే విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల మామిడి రైతులకు మొండిచెయ్యి చూపింది.
సబ్సిడీ ఇవ్వాలని రైతుల డిమాండ్
పల్ప్ పరిశ్రలు, ప్రాసెసింగ్ యూనిట్ల యాజ మాన్యాలు నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కాక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని బెంగళూరు రకం మామిడి రైతులు నష్టపోతున్నారు. ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులకు మామిడి సాగు, గిట్టుబాటు ధరలపై అవగాహన లేకపోవడం ఇందుకు కారణమని విమర్శిస్తున్నారు. మామిడి కౌలు రైతులకు జరుగుతున్న నష్టాలను రాష ్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో రాయలసీమ నేతల కంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులు వెనుకబడ్డారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ రెండు జిల్లాలకు సబ్సిడీ వర్తించలేదంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం స్పందించి పల్ప్ పరిశ్రమలకు బెంగళూరు మామిడిని ఎగుమతి చేసే రెండు జిల్లాల రైతులకు సబ్బిడీ కల్పించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.