Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఒంగోలులో హెరిటేజ్‌ వాక్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:34 PM

ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఉదయం 7 గంటలకే వివిధ వర్గాలకు చెందిన వందలాది మంది నగరంలోని మంగమూరు రోడ్డు బైపాస్‌ జంక్షన్‌కు తరలివచ్చారు. 8 గంటలకల్లా విద్యార్థులు, యువకులు, మహిళలు, టీడీపీ శ్రేణులతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..  ఒంగోలులో హెరిటేజ్‌ వాక్‌
హెరిటేజ్‌ వాక్‌లో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌, భారీగాపాల్గొన్న ప్రజలు

భారీగా పాల్గొన్న యువకులు, విద్యార్థులు, విభిన్నరంగాల ప్రజానీకం

అగ్రభాగాన నిలిచి ఉత్సాహపరిచిన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకర్షణీయంగా కార్యక్రమం

30న శతాబ్దిన్నర వేడుకలకు భారీ ఏర్పాట్లు

ఒంగోలు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఉదయం 7 గంటలకే వివిధ వర్గాలకు చెందిన వందలాది మంది నగరంలోని మంగమూరు రోడ్డు బైపాస్‌ జంక్షన్‌కు తరలివచ్చారు. 8 గంటలకల్లా విద్యార్థులు, యువకులు, మహిళలు, టీడీపీ శ్రేణులతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు వేలాది మందితో హెరిటేజ్‌ వాక్‌ సాగింది. ‘జయహో ఒంగోలు’ అన్న నినాదంతో నగరం దద్దరిల్లిపోయింది. మూడు నెలలుగా నగరంలో వివిధ కార్యక్రమాలు సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసరైన కలెక్టర్‌ పి.రాజాబాబు సారఽథ్యంలో అధికార యంత్రాంగం, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఇవి కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఈనెలలో ఒకే రోజు ఒంగోలు నియోజకవర్గ వ్యాప్తంగా 150 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 23 వేల మందికి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గత ఆదివారం నగరంలో మెగా సెగ్రెగేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి 80 వేలకుపైగా గృహాలు, దుకాణాలు, ఇతరత్రా వాటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ప్రజలకు అవగాహన కల్పించారు. వరల్డ్‌ రికార్డు ఆఫ్‌ బుక్స్‌లో కూడా ఆ కార్యక్రమం నమోదైంది. వీటికి కొనసాగింపుగా ఆదివారం హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు.


ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రసంగించారు. ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ 150 ఏళ్ల ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హెరిటేజ్‌ వాక్‌లో పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, మాజీ మేయర్‌ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకట కృష్ణయ్యతోపాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్‌మోహన్‌, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, పలువురు మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శతాబ్దిన్నర వేడుకలు ఈనెల 30న జరగనున్నాయి. అందుకు నగరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. నగరం అంతటా వేడుకల వాతావరణం నెలకొంది.

Updated Date - Sep 27 , 2026 | 11:34 PM