బరువెక్కిన హృదయాలతో..
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:15 AM
వెలిగొండ నిర్వాసితులు ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. పుట్టి పెరిగిన ఇళ్లు, తరాలుగా సాగు చేసుకున్న భూములు విడిచి తమతో ముడిపడిన జ్ఞాపకాలను అక్కడే వదిలి బరువెక్కిన గుండెలతో కొత్త ఊళ్లవైపు పయనం ప్రారంభించారు.
ఊళ్లను ఖాళీ చేస్తున్న వెలిగొండ నిర్వాసితులు
పొలాల్లో సామగ్రిని తెగనమ్ముకొంటున్న వైనం
చేతికొచ్చిన పంట కడసారి అమ్మకం
అద్దె ఇళ్లను వెతుక్కుని సామాన్లు సర్ది...
కొత్త గ్రామాల వైపు పయనం
మా త్యాగం ఎందరికో భవిష్యత్తు అన్న ఆనందంలో కొందరు
పుట్టి పెరిగిన ఊరు ఇక లేదన్న వేదనలో మరికొందరు
మార్కాపురం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ నిర్వాసితులు ఊళ్లను ఖాళీ చేస్తున్నారు. పుట్టి పెరిగిన ఇళ్లు, తరాలుగా సాగు చేసుకున్న భూములు విడిచి తమతో ముడిపడిన జ్ఞాపకాలను అక్కడే వదిలి బరువెక్కిన గుండెలతో కొత్త ఊళ్లవైపు పయనం ప్రారంభించారు. పునరావాస కాలనీల్లో గూడు ఏర్పాటు చేసుకునే వరకూ ఎక్కడో ఒకచోట అద్దె ఇళ్లలో ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని తలోదారిన వెళుతున్నారు. ఇంతటి వేదన వారిలో ఉన్నప్పటికీ లక్షలాది మందికి తమ త్యాగంతో ప్రయోజనం చేకూరుతుందన్న ఆశ కొంత ఆనందాన్ని కలిగిస్తోంది. శుక్రవారం వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు వెళ్లిన ’ఆంధ్రజ్యోతి’కి ప్రతి వీధి, ప్రతి ఇంటివద్ద ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది.
కల సాకారమవుతున్న వేళ..
జిల్లా వాసుల ముప్పై ఏళ్ల కల సాకారమవుతోంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా త్వరలో నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు రాబోతున్నాయి. ఈ రిజర్వాయర్‌లో సుంకేసుల, కలనూతల, గొట్టిపడియ, గుండంచర్ల, కాటంరాజుతాండా, చింతలముడిపి, సాయిరాంనగర్, రామలింగేశ్వరపురం, కృష్ణానగర్, లక్ష్మీపురం, అక్కచెరువు గ్రామాలు ముంపునకు గురవుతాయి. తమకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని, ఏదో ఒకరోజు తాము ఊళ్లను వదిలి వెళ్లాలని గతంలోనే తెలిసినప్పటికీఖాళీ చేయాల్సి వచ్చిన క్షణాలు వారి గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. గతంలో వైసీపీ హయాంలో పైసా కూడా పరిహారం ఇవ్వకపోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.905 కోట్లకుగాను ఇప్పటికే రూ.518 కోట్లు నిర్వాసితులకు అందించింది. మరో రూ.200కోట్లు శనివారం విడుదల చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని కూడా మరో వారంలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక గ్రామాలు ఖాళీ చేయాలని, నెలాఖరులో తప్పనిసరిగా కృష్ణాజలాలతో రిజర్వాయర్ నింపుతామని ప్రభుత్వం చెప్పడంతో నిర్వాసితులు ఊళ్లను వదిలి ఒక్కొక్కరుగా బయటకు రావడం ప్రారంభమైంది.
ఒక్క ఊరి నుంచే బయలుదేరినా తలోదారి
ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల ప్రజల పునరావాసం కోసం ఏడు చోట్ల కాలనీలు సిద్ధమవుతున్నాయి. అన్ని మౌలిక వసతులు పూర్తయినప్పటికీ ఇప్పటికిప్పుడు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కష్టం కావడంతో నిర్వాసితులంతా వారికి అద్దెకు ఎక్కడ ఇళ్లు దొరికితే అక్కడకు వెళుతున్నారు. అంటే ఒక ఊరినుంచి బయలుదేరిన వారు తలోదారికి వెళుతున్నారు. మార్కాపురం పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లోని ఇళ్లను అద్దెకు తీసుకుని అందులోకి సామగ్రిని చేర్చుకుంటున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నవారు కొందరు అమ్ముకోగా మరికొందరు తమ బంధువులతో మాట్లాడుకుని పల్లెల వైపు పయనమవుతున్నారు. మొత్తానికి నిర్వాసిత కాలనీల్లో ఆవాసాలు ఏర్పరచుకునే వరకు తలో ఊరిలో ఉండాల్సిందే.
పొలాల్లో సామాగ్రి తెగనమ్ముతూ....
ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వేళ భూములున్న రైతులు వారి పొలాల్లోని వ్యవసాయ సామగ్రిని బయటకు తీసుకెళ్లలేక, తమ గ్రామాల్లో వాటిని ఉంచే వీలులేక ఎక్కడికక్కడే ఇతర గ్రామాల వారికి తక్కువ ధరకు తెగనమ్ముతున్నారు. 11 ముంపు గ్రామాల్లో విద్యుత్‌శాఖ నివేదికల ప్రకారం 1,200 వ్యవసాయ బోర్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 500 వరకు ఉంటాయి. వీటిలో ఉన్న మోటార్లు, పైపులు బయటకు తీసి వాటిని వ్యాపారులకు, ఇతర ప్రాంతాల రైతులకు అమ్ముకుంటున్నారు. కనీసం ఒక్కో బోరు సామగ్రి రూ.50వేలు ఖరీదు ఉంటే వాటిని రూ.15 నుంచి రూ.25వేలకు విక్రయిస్తున్నారు. దీంతో ఇతర గ్రామాల వారు ఒక్కొక్కరు నాలుగేసి మోటార్లు కొనుక్కొని ఆటోల్లో తీసుకెళ్తున్నారు. ఇక పశువుల కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్లపై ఉన్న రేకులను కొందరు ఊడదీసి తక్కువ ధరకు అమ్ముకుని వెళుతున్నారు. పొలాల్లోని డ్రిప్ పరికరాలను పాత సామాగ్రి కొనేవారికి తెగనమ్ముకుంటున్నారు. కొందరైతే పశువులను కూడా అమ్ముకుని బయటకు వస్తున్నారు. అద్దె ఇళ్లలో పశువులకు వసతి కష్టమని భావించి ఇలా చేస్తున్నామని చెబుతున్నారు.
చేతికొచ్చిన పంట కొంతైనా దక్కించుకుందాం
కలనూతల. గుండంచర్ల, సుంకేసుల గ్రామాల్లో పత్తి పంటను అధికంగా సాగు చేసి ఉన్నారు. మొత్తం 11 గ్రామాల్లో అధికారిక లెక్కల ప్రకారం 3వేల ఎకరాల్లో పత్తి సాగైంది. ప్రస్తుతం చాలామంది రైతుల వేసిన పత్తి తీతకు వచ్చింది. దీంతో ఊరు ఖాళీ చేసేనాటికి కనీసం చేతికి ఎంత వస్తే అంత పంట అమ్ముకొనేందుకు కొందరు సిద్ధమయ్యారు. శుక్రవారం కలనూతలకు చెందిన రైతు వెంకటేశ్వర్లు పొలంలో దాదాపు 30 మంది కూలీలు పత్తితీత పనిలో కనిపించారు. చాలామంది రైతులు ఇప్పటికే తెచ్చిన పత్తిని వ్యాపారులకు అమ్ముతూ కనిపించారు. పత్తితోపాటు మరో 500 ఎకరాల్లో వివిధ పంటలు వేసినప్పటికీ అవి ఇప్పట్లో చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో నీరు విడుదలయ్యే వరకు వేచి చూసి వాటిని వదిలేసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని భావోద్వేగ హృదయాలతో రైతులు చెబుతున్నారు.